దిల్ రాజు కుమార్తె ఆల్రెడీ ప్రొడక్షన్ లోకి ఎంటరయ్యారు. బలగం లాంటి సినిమా తీశారు. ఇక అశ్వనీదత్ కుమార్తెల సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి కుమార్తెలు, నాగబాబు తనయ కూడా నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో వారసురాలు వచ్చి చేరింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన తర్వాత బ్యానర్ వ్యవహారాలన్నీ తన కుమార్తె చూసుకుంటుందని స్పష్టం చేశాడు ఈ నిర్మాత.
ప్రస్తుతం శర్వానంద్ హీరోగా పీపుల్ మీడియా బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తన కూతురు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోందని, ఆమెకు నిర్మాణ రంగంపై చాలా ఆసక్తి ఉందని తెలిపిన విశ్వప్రసాద్, త్వరలోనే ఆమె ఫుల్ లెంగ్త్ ప్రొడ్యూసర్ అవుతుందని హింట్ ఇచ్చారు.
తన కూతురు కోసం ఆయన ప్రత్యేకంగా మరో బ్యానర్ స్థాపిస్తారా లేక తన బ్యానర్ పైనే సహ-నిర్మాతగా అమెకు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
టీజీ విశ్వప్రసాద్ కు కొడుకు కూడా ఉన్నాడు. కానీ కొడుకు కంటే కూతురికే నిర్మాణ రంగంవైపు ఎక్కువ ఆసక్తి ఉందని, తన కుమారుడికి టెక్నికల్ సైడ్ ఆసక్తి ఎక్కువగా ఉందని తెలిపారు విశ్వప్రసాద్. చూస్తుంటే.. టాలీవుడ్ లో లేడీ ప్రొడ్యూసర్స్ సంఖ్య బాగానే పెరుగుతోంది.