శరీరానికి గాయమైతే, కొన్ని రోజులకు నయమవుతుంది. కానీ మనసులకి గాయమైతే, చచ్చేంత వరకూ మానదు. అందుకే వీపు మీద కొట్టు కానీ, కడుపుపై కొట్టొద్దని పెద్దలు చెబుతుంటారు. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబునాయుడు, రాజకీయ అజ్ఞాని పవన్‌కల్యాణ్ అనేక సందర్భాల్లో చేసిన వివాదాస్పద, అభ్యంతరకర వ్యాఖ్యలు వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యుల మనసుల్ని తీవ్రంగా గాయపరిచాయి.
ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామంటూ వాలంటీర్ల గాయాలపై తాయిలం పూస్తున్నారు. కానీ మనసుకైన గాయం ఎప్పటికీ మానిపోదని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ గ్రహించాల్సి వుంది. ఎన్నికలున్నాయని ఒక మాట, లేనప్పుడు కించపరిచేలా మాట్లాడితే, వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, అలాగే జనం ఎలా మరిచిపోతారని అనుకుంటున్నారో ప్రతిపక్షాల నాయకులకే తెలియాలి.
“ఐదు వేల రూపాయిలతో ఏం ఉద్యోగం అది. గోనె సంచులు మోసే ఉద్యోగమా? మేం పెద్ద ఎత్తున ఇచ్చేశామని కథలు చెబుతారా? వీళ్లు చేసేదన్ని ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం… డిస్ట్రబ్ చేయడం. పగటి పూట మగాళ్లు ఉండరు. వాలంటీర్లు వెళ్లి తలుపు తట్టడం. ఇదెక్కడిదండి. చూస్తే ఎంత నీచం. బాధేస్తుంది, ఆవేదన, ఆగ్రహం వస్తుంది” అని చంద్రబాబునాయుడు గతంలో అన్నారు.
ఇప్పుడీ నాయకుడు వాలంటీర్లకు తీపి కబురు చెప్పానంటున్నారు. రూ5 వేలు కాదు, రూ.10 వేలు ఇస్తానని నమ్మబలుకుతున్నారు. కానీ గతంలో అవమానించే రీతిలో అన్న మాటల్ని వాలంటీర్లు మరిచిపోయి, ఎన్నికల్లో తనకు రాజకీయ లబ్ధి కలిగించేలా పని చేస్తారని ఆశ పడుతున్నారు. ఇక పవన్‌కల్యాణ్ వాలంటీర్లపై చేసిన కామెంట్స్… అన్ని హద్దుల్ని దాటిపోయాయి.
ఉమెన్ ట్రాఫికింగ్‌కు వాలంటీర్లు పాల్పడుతున్నారని, ఏపీలో 30 వేలకు పైగా అమ్మాయిలు అదృశ్యం అయ్యారని పవన్‌కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ వాలంటీర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కానీ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించగానే… అన్నీ మరిచిపోయి తమకు అనుకూలంగా ఎన్నికల్లో పని చేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు.
ఎవరినైనా మోసగించగలననే విశ్వాసమే, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు చెల్లిందే. ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒకటి చెప్పి, ప్రజల్ని బురిడీ కొట్టించగలనని చంద్రబాబు విశ్వాసం. వాలంటీర్ల విషయంలోనూ ఆయన వ్యూహం అదే. అయితే ఒక్కటి మాత్రం నిజం… వాలంటీర్లు ఎన్నికల్లో ప్రభావం చూపుతారని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఆ భయంతోనే రూ.10 వేల తాయిలం అని చెప్పక తప్పదు.