శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రాజకీయంగా ప్రతిష్ట కలిగినది. ఈ సీటులో 1994లో ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున గెలిచారు. అంతలా ప్రాముఖ్యత నాడు ఈ సీటు తెచ్చుకుంది. గత రెండు ఎన్నికల నుంచి ఈ సీటుని గెలిచే విషయంలో వైసీపీ టీడీపీతో భీకర పోరు సాగిస్తోంది.
ఈ సీటు నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వరసగా రెండు సార్లు గెలిచారు. ఇపుడు 2024లో హ్యాట్రిక్ విజయం కోసం చూస్తున్నారు. ఆయన్ని ఎలాగైనా ఓడించాలని వైసీపీ ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని పోటీకి పెట్టింది. అక్కడ ఇదే సీటు కోసం పోటీలో ఉన్న పేడాడ తిలక్ కి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిత్వాన్ని ఇచ్చింది.
అలా ఈ ఇద్దరినీ సర్దుబాటు చేసిన వైసీపీ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఆమె శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తారు అనుకుంటే టెక్కలి అసెంబ్లీకి ఆమె పేరుని తాజా జాబితాలో కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు.
ఆమెకు టెక్కలిలో కొంత పట్టు ఉంది. వైసీపీలో మూడు వర్గాలుగా ఆమె ఉన్నపుడు ఉండేవి. 2019లో ఈ వర్గ పోరు వల్లనే అచ్చెన్న జగన్ ప్రభంజనంలోనూ గెలిచారు అని అంటారు. ఇపుడు రెండు వర్గాల మధ్య రాజీ చేసిన వైసీపీకి కిల్లి నుంచి ఇబ్బంది ఉంటుందని అంటున్నారు. కిల్లి కృపారాణి, పేడాడ తిలక్ దువ్వాడ శ్రీనివాస్ ముగ్గురూ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారే. టెక్కలిలో ప్రధాన సామాజిక వర్గంగా వారు ఉన్నారు. ఆ తరువాత వెలమలు ఇతర సామాజిక వర్గాలు వస్తాయి.
ఇపుడు కిల్లి పోటీతో ఎవరి ఓట్లకు చిల్లు పడుతుందని అని విశ్లేషించుకుంటే ఆమె నిన్నటివరకూ వైసీపీలో ఉన్నారు. అంతకు ముందు ఆమె కాంగ్రెస్ ఇపుడు మళ్ళీ కాంగ్రెస్. ఆ విధంగా చూస్తే ఆమె వైసీపీ ఓట్లకు గండి కొడతారు అని టీడీపీ నేతలు అంటున్నారు. అంతే కాదు ఆమె పోటీతో ఇద్దరు కాళింగ అభ్యర్ధిల మధ్య పోరు సాగి ఆ ఓట్లు చీలిపోతాయని అంటున్నారు.
అది టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు. వైసీపీ నేతల వెర్షన్ చూస్తే ఆమె పోటీ వల్ల టీడీపీకే నష్టం అని తమకు పడని ఓట్లను టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా పంచుకుంటే తమకే మెజారిటీ పెరుగుతుందని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే టెక్కలి పోరు కాస్తా త్రిముఖ పోరుగా మారుతుందా అన్నదే ఆసక్తిని రేపుతోంది.