పాతికేళ్ల రాజకీయంలో సొంత సీటు లేని గంటా!

విశాఖకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుది పాతికేళ్ల రాజకీయ జీవితం. అయినా ఆయనకు ఈ రోజుకూ సొంత సీటు లేకపోవడమే రాజకీయ చిత్రం. 1999లో అనకాపల్లి నుంచి ఎంపీగా…

విశాఖకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుది పాతికేళ్ల రాజకీయ జీవితం. అయినా ఆయనకు ఈ రోజుకూ సొంత సీటు లేకపోవడమే రాజకీయ చిత్రం. 1999లో అనకాపల్లి నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసిన గంటా 2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజేత అయ్యారు.

ఆ తరువాత 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన భీమునిపట్నం నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి కూడా అయ్యారు. 2019లో ఆయన విశాఖకు నార్త్ కి షిఫ్ట్ అయి జగన్ వేవ్ లో కూడా గెలిచారు. ఈసారి ఆయన అయితే భీమిలీ లేకపోతే చోడవరం సీటు ఆశిస్తూ వచ్చారు.

కానీ టీడీపీ హై కమాండ్ ఆయన్ని పూర్తిగా విశాఖ జిల్లా రాజకీయాల నుంచే తప్పించేస్తోంది. విజయనగరం జిల్లాకు బదిలీ చేస్తోంది. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ మీద గెలిస్తే టీడీపీ ప్లాన్ సూపర్ హిట్. ఒకవేళ గంటా ఓడితే అది గంటాకు వ్యక్తిగత రాజకీయ నష్టంగా మిగులుతుంది.

ఇలా అడకత్తెరలో పోకచెక్కలా ఒక ప్లాన్ ని తెచ్చి గంటాను ఇరికించారు. గంటా విశాఖ జిల్లాలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉన్న వారు అన్నది 2019లో కొంత దెబ్బ తింది. ఆయన అతి స్వల్ప తేడాతోనే విశాఖ నార్త్ నుంచి గెలిచారు. అటువంటిది ఆయన చీపురుపల్లికి ట్రాన్స్ ఫర్ అయితే ఈ అతి తక్కువ సమయంలో అందరినీ కూడగట్టుకుని గెలవడం సాధ్యమయ్యే పనేనా అన్నది అనుచరులలో ఆలోచనగా ఉంది.

గంటా ప్రతీ ఎన్నికకూ ఒక నియోజకవర్గం మారడం రెండు దశాబ్దాలుగా విజయవంతంగా  సాగింది కానీ ఇపుడు అదే ఆయనకు మైనస్ అయింది అని అంటున్నారు. గంటా సొంత సీటు అన్నది ఒక దాన్ని ఉంచుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అని అంటున్నారు. ఆయన 2019లో గెలిచిన విశాఖ నార్త్ లో గత అయిదేళ్ళూ పూర్తిగా క్రియాశీలకంగా పనిచేసి ఉంటే ఆ సీటే ఆయన సొంత నియోజకవర్గం అయ్యేది అని అంటున్నారు. అక్కడ టీడీపీకి వేరే స్ట్రాంగ్  లీడర్ కూడా లేరు.

అయితే గంటా తనకు ఎక్కడైనా టికెట్ ఖాయం అని అతి ధీమాకు పోయారని చివరికి టీడీపీ హై కమాండ్ ఈసారి మార్చిన కొత్త విధానంలో సీనియర్లను మెల్లగా పక్కకు పెడుతోంది. అందుకే గంటాకు ఇలా ఝలక్ ఇచ్చేసింది అంటున్నారు. ఇది గంటా చేసుకున్న స్వయంకృతాపరాధమా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.