Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఈ ఒక్కసారి జగన్ గెలిస్తే..!

ఈ ఒక్కసారి జగన్ గెలిస్తే..!

2024 ఎన్నికల లాంటివి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రం చూసి వుండకపోవచ్చు. 1977 ప్రాంతంలో దేశంలోని రాజకీయ పక్షాలు మొత్తం ఒక్క తాటి మీదకు వచ్చాయి. అటు పక్క కేవలం ఇందిర మాత్రం మిగిలారు. సకల రాజకీయ పక్షాలు, బలమైన మీడియా, మేధావులు, ఎక్సట్రా… ఎక్సట్రా ఒకవైపు, ఇందిరా గాంధీ మరో వైపు మోహరించారు.  ఒక్క ఆంధ్ర మినహా దేశం మొత్తం మీద కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి. ఇందిర ఓడిపోయారు. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం గద్దె ఎక్కింది. కానీ అచిరకాలంలోనే కూలిపోయింది. అందులో ముక్క అయినా జనసంఘ్ కాస్తా భార‌తీయ జనతా పార్టీగా మారి ఇప్పటికి అస్తిత్వంతో వుంది.

ఇప్పుడు ఆంధ్రలో అదే పరిస్థితి. బలమైన మీడియా తెర వెనుక వుండి లీడ్ చేస్తోంది. తెరముందు అన్ని విధాలా బలమైన, సమర్ధవంతమైన సామాజిక వర్గం నిలుచుంది. మరో సామాజిక వర్గం అండ తీసుకుంది. చిన్న చితక అందరూ ఒక తాటి మీదకు వచ్చారు. వామపక్షాలకు కలవాలి అని వున్నా, భాజపా అక్కడ వుండడంతో కలవలేని పరిస్థితి. కానీ కొన్ని ఈక్వేషన్ల రీత్యా అటే మొగ్గాల్సిన పరిస్థితి. అటు వైపు ఒకే ఒక్కడు జగన్.

మరి ఇందరి మాదిరిగా ఓడి పోతారా? లేక పోరాడి గెలుస్తారా? అన్నదే ప్రశ్న.

కానీ ఈ ప్రశ్న సంగతి పక్కన పెడితే వేరే పాయింట్ వుంది. ఈ భయంకర యుద్దంలో కనుక జగన్ విజేతగా నిలిస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. జగన్ గెలిస్తే 2029 ఎన్నికల నాటికి తెలుగుదేశం వుండకపోవచ్చు. లేదా బాగా బలహీన పడవచ్చు. దానికి అండ దండగా వున్న బలమైన మీడియా కూడా ఇక బలహీనపడిపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇక కింకర్తవ్యం అని వుండిపోవచ్చు. చిన్న చితక పార్టీలు దుకాణం సర్దేసుకోవచ్చు.

ఎందుకంటే ఇంత భారీ యుద్దం మరోసారి చేసే అవకాశం వుండకపోవచ్చు. ఇంత మందిని మళ్లీ సమీకరిస్తున్న తెరెవెనుక శక్తి ఇక సన్నగిల్లిపోవచ్చు. జగన్ కు ఎదురీదే ధైర్యం, సత్తా ఇక ఇప్పట్లో ప్రదర్శించే అవకాశం ఎవరికీ ఉండకపోవచ్చు. ఇదంతా జగన్ గెలిస్తేనే.

ఈ పరిస్థితి, ఇప్పుడు ఏ షరతులు పెట్టుకోకుండా, ఏ రకమైన స్ట్రాటజీ సారూప్యతలు, సిద్దాంత ఏకీకరణలు లేకుండా కేవలం జగన్ ను గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న వారికి మింగుడు పడదు. వాటి శిబిరాల్లో శ్మశాన వైరాగ్యం అలుముకుంటుంది.

కానీ జగన్ ఓడిపోతే..

అయిదేళ్ల పాటు జగన్ ఇబ్బందులు పడొచ్చు. న్యాయపోరాటాలు సాగించాల్సి రావచ్చు. 2014, 2019 స్థాయి పోరాటాలు మళ్లీ చేయలేకపోవచ్చు. కానీ 1977 ప్రాంతంలో జనతా ప్రభుత్వం ఫెయిల్ అయినంత కాకపోయినా, జనం కావాలనుకున్న, లేదా రుచి చూసిన పథకాల అమలులో తేడా వస్తే మాత్రం, వాళ్లే మళ్లీ జగన్ ను తెచ్చుకుంటారు. గతంలో ఇందిర మళ్లీ బంపర్ మెజారిటీతో గద్దె ఎక్కినట్లే. ఆ తరువాత జనతాలో చాలా అంటే చాలా పక్షాలు మాయం అయ్యాయి. ఇప్పుడూ అదే జరుగుతుంది.

కానీ ఇప్పటికి మాత్రం వైరి పక్షాలు అన్నీ జగన్ గెలవకూడదని జపాలు చేయాలి. పూజలు చేయాలి. పోరాటాలు చేయాలి. అవన్నీ ఫలించక జగన్ గెలిచాడే అనుకోండి… చెప్పేది లేదు.. చూడడమే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?