అద్భుతమైన కమర్షియల్ సబ్జెక్ట్ దొరికింది.. నేను తీస్తానంటే, నేను తీస్తాను అని ఇద్దరు పోటీ పడ్డారు అంటే కాస్తయినా అర్ధం చేసుకోవచ్చు. అలా కాకుండా ఓ నాన్ కమర్షియల్ డాక్యుమెంటరీ మోడల్ బయోపిక్ కోసం పోటీ పడడం కాస్త ఆశ్చర్యంగా వుంటుంది.
ఇంతకీ ఆ ఇద్దరు నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్. ఈ ఇద్దరూ కలిసి మంచి సినిమాలు అందించారు. ఇప్పుడు శాస్త్రవేత్త, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కథను తెర మీదకు తీసుకురావాలనుకున్నారు. ఓ పేద కుటుంబంలో పుట్టి, ప్రపంచం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగి, మన దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన వ్యక్తి అబ్దుల కలాం. ఆయన కథలో కావాల్సినంత ఎమోషన్, కంటెంట్ అన్నీ వున్నాయని ఆ ఇద్దరు నిర్మాతల నమ్మకం. అందుకే సినిమా తీయాలనుకున్నారు.
కానీ ఎందుకో సినిమాకు దర్శకుడు ఎవరు అన్న దగ్గర చిన్న తేడా వచ్చింది. అంతే మార్గాలు వేరయ్యాయి. తానే తీసుకుంటా అని అనిల్ సుంకర, తాను తీస్తానని అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు సన్నాహాలు చేసుకుంటున్నారు. అనిల్ సుంకర ఓ బాలీవుడ్ నటుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
నిజానికి అన్ని బయోపిక్ లు కమర్షియల్ హిట్ లు కావు. కేవలం ఓటిటి మీద ఆధారపడి అబ్దుల్ కలామ్ బయోపిక్ ను నిర్మించాల్సి వుంటుంది. ఎవరు ముందు అనౌన్స్ చేసి, మంచి కాంబినేషన్ సెట్ చేసుకుంటే వారి సినిమాకే నాన్ థియేటర్ రైట్స్ వస్తాయి. రెండో వారు ఆగిపోవాల్సి వుంటుంది. ఈ మాత్రం దానికి ఇద్దరు మిత్రులకు పంతం ఎందుకో?
ఇదిలా వుంటే అనిల్ సుంకర ఈ సినిమాతో మరోసారి తాను దర్శకుడిగా తెర మీద పేరు వేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.