చంద్రబాబునాయుడు మోసపూరితమైన మాటలు రాబోయే ఏడాది పాటు మరింత ఉధృతంగా సాగుతూ ఉంటాయనడానికి ఇదొక నిదర్శనం. టిడ్కో ఇళ్లు అనేవి చంద్రబాబునాయుడుకు దొరికిన ఒకానొక బ్రహ్మాస్త్రం. సర్కారు టిడ్కోఇళ్లను ఇంకా లబ్ధిదారులకు ఇవ్వడం లేదనే విషయాన్ని ఆయన పదేపదే వాడుకుంటున్నారు.
టిడ్కో ఇళ్లు అనే డ్రామాను మొదలుపెట్టి.. తన పాలన కాలంలో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేసి ఇవ్వలేకపోయిన చంద్రబాబు, ఇప్పుడు నిందలన్నీ జగన్ మీద వేస్తున్నారు. రాష్ట్రంలో ఏడున్నర లక్షల టిడ్కో ఇళ్లు అనేది మొత్తం ప్రతిపాదన. సగం పూర్తికాగా, సగం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడున్నర లక్షల ఇళ్ల కుటుంబాలకు చంద్రబాబు ఇప్పుడు పెద్ద ఎర వేస్తున్నారు.
తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. ఈ మొత్తం ప్రజలకు టిడ్కో ఇళ్లను పూర్తి ఉచితంగా అందజేస్తామని అంటున్నారు. ఇదొక ఎత్తుగడ. అయితే పార్టీ మేనిఫెస్టో గురించి చంద్రబాబు మరింత కామెడీ డైలాగులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రజల బాధలను తీర్చడమే లక్ష్యంగా చంద్రబాబు పార్టీ మేనిఫెస్టోను రూపొందిస్తారట. ప్రజలనుంచి వస్తున్న అభ్యర్థనలను పరిశీలించి, వారి కష్టాలను తెలుసుకుని అవి తీరేలా పార్టీ మేనిఫెస్టో రూపకల్పన ఉంటుందట.
చంద్రబాబునాయుడు మేనిఫెస్టో అనే పదం ఎత్తితేనే జనం నవ్వుకుంటున్నారు. ఒక పుస్తకం లాంటి అతిపెద్ద మేనిఫెస్టో తయారు చేయడం, ఆర్భాటంగా విడుదల చేయడం, అధికారంలోకి రాగానే దానిని మర్చిపోవడం తెలుగుదేశానికి అలవాటే కదా అని ప్రజలు అంటున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ప్రజలకు ఏయే హామీలు ఇచ్చారో ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేలా.. సదరు మేనిఫెస్టోను పార్టీ వెబ్ సైట్ నుంచి డిలిట్ చేసిన ఘనమైన చరిత్ర తెలుగుదేశానికి ఉంది. అదే జగన్ విషయంలో 2019లో ఒకే పేజీ మేనిఫెస్టో విడుదల చేసి.. అందులో 95 శాతం అమలు చేసిన చరిత్ర.
అధికారం దక్కిన తర్వాత.. అసలు తన మేనిఫెస్టో ఏమిటో ఎవ్వరికీ కనపడకుండా మాయం చేసే అలవాటు ఉన్న చంద్రబాబునాయుడుకు ఆ మేనిఫెస్టో అనే పదం ద్వారా ప్రజలను బుకాయించే అధికారం ఎలా వస్తుందని జనం నవ్వుకుంటున్నారు. మేనిఫెస్టో అనే పదం పలికే అర్హత ఆయనకు లేదని అంటున్నారు.