లోకేశ్ పాదయాత్రలో సొంత పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో జైలుపాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు అధికారులు వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్ రావాల్సి వుందని సమాచారం.
ఇదిలా వుండగా ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియ దంపతులతో పాటు మరో 9 మందిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అఖిలప్రియను రెండు రోజుల క్రితం ఆళ్లగడ్డలో ఆమె ఇంట్లో అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అఖిలప్రియను కర్నూలు సబ్‌జైలుకు తరలించారు.
జైల్లో నీరసంగా ఉందని సంబంధిత అధికారుల దృష్టికి అఖిలప్రియ తీసుకెళ్లారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, రిపోర్ట్ రాగానే ట్రీట్‌మెంట్ చేయనున్నారు. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా వుంటే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసుకునే అవకాశం వుంది. లేదంటే తిరిగి జైలుకు తీసుకెళ్తారు.
గతంలో హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసులో కూడా ఇదే రకంగా అఖిలప్రియ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి జైలుకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.