దివంగత ఎన్టీఆర్ ఏ లోకాన వున్నారో గానీ, ఆయన్ను చంద్రబాబు వాడుకోవడం మాత్రం వదల్లేదు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు నరకాన్ని చూపారు. చనిపోయిన తర్వాత ఆహా, ఓహో అంటూ కీరిస్తున్నారు. నాలుగ్గోడల మధ్య మాత్రం దివంగత ఎన్టీఆర్‌ను తెగ తిట్టేస్తున్నారు. ఎన్టీఆర్‌ను ఏం చేయడానికైనా తమకే హక్కులున్నాయనేలా చంద్రబాబు, టీడీపీ నేతల వ్యవహార శైలి వుంది.
ఈ నెల 20న హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సెటైర్స్ పేలుతున్నాయి. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకు వెన్నుపోటు వేడుకలను నిర్వహించాల్సిన అవసరం వుందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పులు, రాళ్లు వేయించడం, అలాగే ముఖ్యమంత్రి సీటు నుంచి తోసేయడం, అసెంబ్లీలో కనీసం మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వకుండా అవమానించడం, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడం, పార్టీ గుర్తును లాక్కోవడం తదితర అంశాలపై ప్రముఖులతో ప్రసంగాలు ఇప్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా తనకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడంపై ఎన్టీఆర్ చేసిన చారిత్రక ప్రసంగాన్ని పుస్తకంగా తీసుకొచ్చి, వెన్నుపోటు దినం నాడు ఆవిష్కరిస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి లక్ష్మీపార్వతిని ఎలా పావుగా వాడుకున్నారో కూడా లోకానికి తెలియజేయాల్సిన అవసరం వుందనే వాళ్లే ఎక్కువ.
ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చెప్పిందే చరిత్ర అవుతుందని, కావున వాస్తవాలు తెలియాలంటే ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటి ఎన్టీఆర్ అభిమాన నేతలు ముందుకు రావాల్సిన అవసరం వుంది. ఆ దిశగా వారు ఆలోచిస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది.