ఈ నెల 20న హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తదితరులకు స్థానం లేదు. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు భజనపరులను మాత్రమే ఆహ్వానించడం విమర్శలపాలవుతోంది.
ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ వెల్లడించిన వివరాల ప్రకారం… శతజయంతి వేడుకలకు సినీ పరిశ్రమకు సంబంధించి పవన్‌కల్యాణ్, విక్టరీ వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, సుమన్, మురళీమోహన్, నందమూరి కల్యాణ్‌రామ్, మాజీ ఎంపీ జయప్రద, రాఘవేంద్రరావు, అశ్వనీదత్, ఆదిశేషగిరిరావు తదితరులను ఆహ్వానించారు.
వీరిలో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వారిని రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు అని చూపడానికి మాత్రమే పిలిచారు. అయితే వీరిని ఆహ్వానించడం వెనుక కూడా రాజకీయం వుంది. ప్రభాస్‌ను ఆహ్వానించడం ద్వారా రాజుల కమ్యూనిటీతో పాటు ఆయన అభిమానులను ఆకర్షించే ప్రయత్నం దాగి వుంది. ఇక పవన్‌కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇప్పటికే చంద్రబాబు పల్లకీ మోస్తున్నారు. అందుకు కాబట్టి ఆయన్ను ఆహ్వానించారు.
ఇక అశ్వనీదత్ ఇటీవల కాలంలో బహిరంగంగానే వైసీపీ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. అలాగే సీనియర్ హీరో సుమన్ ఇటీవల కాలంలో చంద్రబాబును పొగుడ్తున్నారు. ఆ కారణంగా ఆయన్ను ఆహ్వానించారు. ఇక రాఘవేంద్రరావు, మురళీమోహన్, జయప్రదలతో చంద్రబాబు అనుబంధం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను తప్పనిసరి పరిస్థితిలో పిలవాల్సిన పరిస్థితి. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఆయన వచ్చే పరిస్థితి లేదని సమాచారం. దీంతో చంద్రబాబు ఊపిరి పీల్చుకుంటారు.
నిజానికి దివంగత ఎన్టీఆర్‌తో డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబుకు మంచి అనుబంధం వుంది. ఆయన్ను ఆహ్వానిస్తే నిజాలు మాట్లాడ్తారనే భయంతోనే ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెట్టారు. ఎన్టీఆర్ తరం తర్వాత ఆ స్థాయిలో అభిమానుల మన్ననలు పొందిన హీరో మెగాస్టార్ చిరంజీవి. అయితే సీఎం జగన్‌తో చిరంజీవి సన్నిహితంగా ఉంటారనే కారణంతో ఆయన్ను పక్కన పెట్టారు.
కేవలం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చంద్రబాబును ఆకాశానికెత్తే వాళ్లను మాత్రమే ఆహ్వానించారనేది పచ్చి నిజం.