మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కాంగ్రెస్ పార్టీ తమ భావసారూప్యత ఉన్న పార్టీల నుంచి తప్పించింది. అందుకే కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి బాబును కాంగ్రెస్ ఆహ్వానించలేదనే చర్చకు తెరలేచింది. ఈ నెల 20న కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది.
ఈ ప్రమాణ స్వీకారానికి దేశ వ్యాప్తంగా భావసారూప్యత ఉన్న పార్టీలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సందర్భంలో తమతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును తాజాగా పట్టించుకోకపోవడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన చంద్రబాబునాయుడు మౌనాన్ని ఆశ్రయించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. అయితే కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం రావడంతో చంద్రబాబు రాజకీయంగా భయపడ్డారు.
తమపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను ఎక్కడ ఉసిగొల్పుతుందో అని చంద్రబాబు వణికిపోయారు. బతుకు జీవుడా అంటూ బీజేపీపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. పైగా ఇటీవల కాలంలో మోదీని చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో, మళ్లీ ఆ పార్టీ పుంజుకుంటోందన్న నమ్మకం చంద్రబాబులో ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ పతనమై, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచిదనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. అలాగని బయటికి ఏమీ చెప్పలేని పరిస్థితి.
గతంలో రాజకీయంగా తమను వాడుకుని, బీజేపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు మొహం చాటేయడంపై కాంగ్రెస్ నేతలతో పాటు మమతాబెనర్జీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఆగ్రహంగా ఉన్నారు. బాబు పచ్చి స్వార్థపరుడని వారు మండిపడుతున్నారు. దీంతో ఆయనకు దూరంగా ఉండడమే మంచిదన్న ఆలోచనలో కాంగ్రెస్ సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీల నేతలున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కర్నాటకలో జరిగే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని సమాచారం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ నేతల్ని కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదు. ఎందుకంటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీలు తమ రాష్ట్రాల్లో పోరాటం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట కర్నాటక కేంద్రంగా అనేక పార్టీలు కలవడం విపక్షాల దృష్టిలో శుభపరిణామం.