ఔనా…నిజ‌మా బాబూ!

చంద్రబాబు మాట‌ల‌కు అర్థాలే వేరు. ఆయ‌న చెబుతున్న‌దానికి, ఆచ‌ర‌ణ‌కు చాలా తేడా వుంటోంది. ముఖ్యంగా అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఈ ద‌ఫా ఎలాంటి మొహ‌మాటం లేద‌ని ఆయ‌న అన్నారు. కానీ అందులో నిజం లేద‌నేది టీడీపీ…

చంద్రబాబు మాట‌ల‌కు అర్థాలే వేరు. ఆయ‌న చెబుతున్న‌దానికి, ఆచ‌ర‌ణ‌కు చాలా తేడా వుంటోంది. ముఖ్యంగా అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఈ ద‌ఫా ఎలాంటి మొహ‌మాటం లేద‌ని ఆయ‌న అన్నారు. కానీ అందులో నిజం లేద‌నేది టీడీపీ నేత‌ల వాద‌న‌. 

ప్ర‌స్తుతం అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు టికెట్లు ద‌క్క‌వ‌నే అనుమానం ఉన్న‌వాళ్లు అస‌మ్మ‌తి స్వ‌రాలు వినిపిస్తున్నారు. స‌త్తెన‌ప‌ల్లెలో కోడెల శివ‌రామ్‌, విజ‌య‌వాడ‌లో ఎంపీ కేశినేని నాని, చిల‌క‌లూరిపేట‌లో ప‌త్తిపాటి పుల్లారావు త‌దిత‌రుల‌ను దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు కీలక వ్యాఖ్య‌లు చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ… ‘ఈ సారి అభ్యర్థుల ఎంపికలో నేను ఏ మొహమాటాలూ పెట్టుకోదలచుకోలేదు. మొహమాటపడి టికెట్లు ఇస్తే ప్రభుత్వంలోకి రాలేం. ఐదారు మార్గాల ద్వారా ప్రతి నియోజకవర్గ సమాచారం సేకరిస్తున్నాను. సర్వేలు చేయిస్తున్నాం. అన్నీ పరిగణనలోకి తీసుకునే అభ్యర్థులను ఎంపిక  చేస్తాం’ అని అన్నారు.

ఇదే నిజ‌మైతే, ప్రొద్దుటూరులో ఉక్కు ప్ర‌వీణ్‌, డోన్‌లో సుబ్బారెడ్డి, శ్రీ‌కాళ‌హ‌స్తిలో బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి త‌దిత‌రులకు టికెట్లు కేటాయించే అవ‌కాశమే లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. త‌మ‌కు న‌మ్మ‌క‌మైన నాయ‌కుడైతే చాల‌నే ఉద్ద‌శంతో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్న భావ‌న క‌లిగిస్తున్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఒక‌వైపు స‌ర్వే నివేదిక‌లు పూర్తిగా అంద‌కుండానే పాద‌యాత్ర‌లో లోకేశ్ చాలా చోట్ల అభ్య‌ర్థులను ప్ర‌క‌టిస్తున్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

చంద్ర‌బాబు చెబుతున్న దానికి, లోకేశ్ ప్ర‌క‌టించ‌డానికి పొంత‌న కుద‌ర‌డం లేదు. చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు కొంద‌రిని ప‌క్క‌న పెట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయే త‌ప్ప‌, అందులో నిజాయ‌తీ క‌నిపించ‌డం లేద‌ని సొంత పార్టీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. చివ‌రికి చంద్ర‌బాబే మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌నేది వారి వాద‌న‌. చంద్ర‌బాబు ఏ మేర‌కు నిర్మొహ‌మాటంగా టికెట్లు ఖ‌రారు చేస్తారో కాల‌మే తేల్చాలి.