పవన్ దృష్టిలో బలం అంటే కులం మాత్రమే!

పవన్ కళ్యాణ్ తరఫున ఆయన పార్టీలోని నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ వారాహి యాత్ర టూర్ షెడ్యూల్‌ను తొలి విడతగా ప్రకటించారు. తొలుత తిరుపతి నుంచి ప్రారంభం అవుతుందని అనుకున్న వారాహి యాత్ర, ఇప్పుడు…

పవన్ కళ్యాణ్ తరఫున ఆయన పార్టీలోని నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ వారాహి యాత్ర టూర్ షెడ్యూల్‌ను తొలి విడతగా ప్రకటించారు. తొలుత తిరుపతి నుంచి ప్రారంభం అవుతుందని అనుకున్న వారాహి యాత్ర, ఇప్పుడు స్వరూపం మార్చుకుని ఉభయ గోదావరి జిల్లాలలో సాగనుంది. 

నిన్న తిరుపతిని ఎంచుకున్నా- ఇవాళ తూర్పుగోదావరి నుంచి ప్రారంభిస్తున్నా అంతిమంగా జనసేన లక్ష్యం మాత్రం ఒక్కటే. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉండే ప్రాంతాలలో తమ పార్టీకి మరింత ఆదరణ పెంచుకోవడానికి వారాహి యాత్ర ఉపయోగపడాలనేది వారి సంకల్పం.

పవన్ కళ్యాణ్ సాగించబోతున్న ఈ వారాహి యాత్ర గురించి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన విషయాలను జాగ్రత్తగా గమనిస్తే అనేక సందేహాలు రేకెత్తుతాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి సినిమా షూటింగులకు సుదీర్ఘ విరామం ఇచ్చి, పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోవడం లేదు. తన సినిమా షూటింగ్లో చాలా బిజీగా పాల్గొంటూ షాట్ గ్యాప్ వచ్చినప్పుడు పార్టీ నాయకులతో మీటింగులు పెట్టుకుంటూ.. షెడ్యూళ్ల మధ్య ఖాళీలు దొరికినప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ పవన్ కళ్యాణ్ జోడు గుర్రాల సవారీ కొనసాగిస్తున్నారు. 

ఆయన టాలెంట్ ను మనం కాదనలేము. ఇప్పుడు కూడా షెడ్యూళ్ల మధ్య ఖాళీ ఎక్కువగా ఉన్నందువలనే ఏకంగా వారాహి యాత్రను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత ఆయన మళ్ళీ షూటింగులకు అటెండ్ అవుతారుట. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే పూర్తి స్థాయి సమయాన్ని ప్రజలకోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కేటాయిస్తారట. ‘సందర్భం’ అంటే నాదెండ్ల వారి భావం.. అధికారం దక్కినప్పుడు అని మార్చి చదువుకోవాలేమో మరి.

పూర్తిస్థాయిలో యుద్ధ భూమిలోకి దిగడం లేదు కనుకనే ఈ వారాహి యాత్ర ఎన్నికల ప్రచారానికి ఉద్దేశించింది కాదని నాదెండ్ల మనోహర్ అభివర్ణిస్తున్నారు. కేవలం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం కోసమే యాత్ర సాగుతుందని అంటున్నారు. ఆ మాటలను కాస్త లోతుగా పరిశీలించినా సరే మనకు కలిగే అభిప్రాయం వేరు. 

పవన్ కళ్యాణ్ దృష్టిలో బలం అంటే కులం మాత్రమే అనేది ఆయన శైలిని అధ్యయనం చేసిన పలువురి అభిప్రాయం. తన సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లోనే తొలి విడత వారాహి యాత్రలు చేయాలనేది పవన్ ఆలోచన.

పార్టీని బలోపేతం చేయడం అంటే కులోపేతం చేయడమే అని ఆయన తీరు మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఎక్కడ తనకు మైకు దొరికినా సరే తనకు తెలిసిన కులాల పేర్లు అన్నింటిని ఏకరువు పెడుతూ, తాను కులం వాసన అంటని విశ్వమానవుడిని అని గప్పాలు కొట్టుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పాదయాత్ర సాగిస్తున్న తీరు కూడా కులప్రాధాన్యంతోనే నిండి ఉండడం విశేషం.