ఈ దశాబ్ద కాలంలో అతిపెద్ద దుర్ఘటన

ఒరిస్సాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్, రైల్వే చరిత్రలోనే పెను విషాదంగా మారింది. ఇంకా చెప్పాలంటే, గడిచిన దశాబ్ద కాలంలో ఇంత ఘోర దుర్ఘటన చోటుచేసుకోలేదు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు…

ఒరిస్సాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్, రైల్వే చరిత్రలోనే పెను విషాదంగా మారింది. ఇంకా చెప్పాలంటే, గడిచిన దశాబ్ద కాలంలో ఇంత ఘోర దుర్ఘటన చోటుచేసుకోలేదు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 278 మంది మృతి చెందినట్టు అధికారిక సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.

భారతీయ రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం 1981లో జరిగింది. ఆ ఏడాది జూన్ 6న బాలాఘాట్ వద్ద తుపాను సమయంలో కిక్కిరిసిన పాసింజర్ రైలు భాగమతి నదీ వంతెనపై ప్రయాణిస్తోంది. ఆ టైమ్ లో రైలు పట్టాలు తప్పింది. 7 బోగీలు నదిలో మునిగాయి. ఆ దుర్ఘటనలో ఏకంగా 800 మంది మరణించారు. అయితే అనధికారిక సమాచారం ప్రకారం, ఆ దుర్ఘటనలో 2వేల మంది వరకు మరణించారు. చాలామంది ఆచూకీ గల్లంతైంది.

ఇప్పుడు ఒరిస్సాలో జరిగిన లాంటి దుర్ఘటనే, 1995లో ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 1995, ఆగస్ట్ 20న, ఓ పాసింజర్ రైలు, ఒకే ట్రాక్ పై ఆగి ఉన్న కాళింది ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. అదే టైమ్ లో, అదే ట్రాక్ పై పురుషోత్తం ఎక్స్ ప్రెస్ కూడా వచ్చింది. అప్పటికే ప్రమాదానికి గురైన 2 ట్రయిన్స్ ను అది ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 350 మంది మరణించారు.

సిగ్నలింగ్ లోపాల వల్ల జరిగిన ఘోర ప్రమాదాల్లో 1999లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ప్రమాదం కూడా ఒకటి. రెండు రైళ్లకు ఒకే ట్రాక్ కేటాయించారు. న్యూఢిల్లీ నుంచి అవధ్ అస్సాం ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకొస్తోంది. అదే టైమ్ లో అదే ట్రాక్ పై నుంచి బ్రహ్మపుత్ర మెయిల్ కూడా వచ్చింది. ఈ రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 300 మంది మృతి చెందారు.

2016లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర ప్రమాదం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. కాన్పూర్ సమీపంలో ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 150మంది అక్కడికక్కడే మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.

ఇక 1988న కేరళలో మరో దుర్ఘటన జరిగింది. కేరళలోని అష్టముడి సరస్సు బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న రైలు పట్టాలు తప్పింది. బెంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న రైలు ఇది. ఈ దుర్ఘటనలో 9 రైల్వే కోచ్ లు నీటమునిగాయి. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

2018లో అమృతసర్ లో జరిగిన రైలు యాక్సిడెంట్ లో 59 మంది.. 2005 ఆంధ్రప్రదేశ్ వెలిగొండలో జరిగిన రైలు ప్రమాదంలో వంద మంది, 2011లో ఫతేపూర్ లో జరిగిన రైలు ప్రమాదంలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు.