సొంత పార్టీ మహిళా నాయకురాలు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారని సమాచారం. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు తెగబడిందని, తమను ఎక్కడికక్కడ కట్టడి చేసిందని సుగుణమ్మ కన్నీటిపర్యంతమవుతూ చంద్రబాబుకు చెప్పడానికి ప్రయత్నించారని తెలిసింది.
పార్టీ నేతలతో బుధవారం చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు…. ఈ సందర్భంగా తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను చంద్రబాబుకు ఏకరువు పెట్టేందుకు సుగుణమ్మ ప్రయత్నించారు. యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, అందుకే కౌంటింగ్‌ను బహిష్కరించాల్సి వచ్చిందని సుగుణమ్మ అధినేతకు వివరణ ఇచ్చారు.
అయితే సుగుణమ్మ కన్నీళ్లు చంద్రబాబు మనసును కదిలించలేకపోయినట్టు సమాచారం. ఇక సోది ఆపమ్మా అని సుగుణమ్మను వారించినట్టు తెలిసింది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినా, ఆ పని ఎందుకు చేయలేదని నిలదీసినట్టు తెలిసింది. గతంలో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎలా నిర్వహించారో తెలిసి కూడా మళ్లీ పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా అన్నట్టు అదే మాట చెప్పడం దేనికని ప్రశ్నించినట్టు సమాచారం.
కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం మనవరాలిని కూడా గెలిపించుకోలేదని గుర్తు చేసినట్టు తెలిసింది. అలాగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను ప్రత్యక్షంగా చూసి కూడా, ఎందుకు అప్రమత్తం కాలేదని నిలదీసినట్టు తెలిసింది. ఎన్నికలంటే రిగ్గింగ్‌లు, దౌర్జన్యాలు లేకుండా ఉంటాయా? ఎన్నికలంటే కొత్తగా చూస్తున్నట్టు మాట్లాడ్డం ఏంటని సుగుణమ్మకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని తెలిసింది.
అలాగే తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌కు కూడా అక్షింతలు వేసినట్టు తెలిసింది. అధికార పార్టీ నేతలతో ముందే మాట్లాడుకుని అరెస్ట్ లేదా గృహ నిర్బంధాలు చేయించుకుంటున్నారా? అని నరసింహయాదవ్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి… టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో తిరుపతి నేతలు చేతులెత్తేసినట్టు టీడీపీ అధిష్టానం అనుమానించడం ఆసక్తికర పరిణామం.