కేంద్రంలో మోడీ సర్కార్ తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలను తమ ప్రభుత్వ పాలసీలుగా చెప్పుకుంటున్నారు. అంటే వాటిని కదిలించడం, సవరించడం అన్నది జరగదు అని చెప్తున్నట్లే. ఈ పరిస్థితుల్లో సంబంధిత మంత్రుల వద్దకు వెళ్ళి మొర పెట్టుకున్నా జరగాల్సింది జరగక మానుతుందా, ఆగుతుందా. ఇది సగటు జనాలలో ఉన్న సందేహం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపు చేయాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నాయకత్వంలో ఉక్కు కార్మిక ప్రతినిధి బృందం ఉక్కు మంత్రి జ్యోతీరాదిత్య సిందియాను కలిసింది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరింది. అంతే కాదు ఉక్కుకు సొంత గనులను కేటాయించాలని కూడా డిమాండ్ చేసింది.
అదే విధంగా 2017 నుంచి ఉన్న నూతన బకాయిలకు సంబంధించి వేతన విధానాన్ని అమలు చేయాలని కూడా కోరింది. ఇలా చాలా కోరికలు ఉక్కు కార్మికులు కోరారు. వీటన్నింటిలో ఒక కోరిక మాత్రం తీరింది. అదేంటి అంటే చాన్నాళ్ళుగా ఉక్కు మంత్రితో భేటీ కావాలని ఉక్కు కార్మిక నేతలు కోరుతున్నారు. దానిని ఇన్నాళ్ళకు విశాఖ వైసీపీ ఎంపీ తీర్చారు.
ఇపుడు ఉక్కు కార్మికులు పెట్టిన డిమాండ్లు అన్నీ కేంద్ర మంత్రి నిదానంగా విన్నారు. అయితే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయకుండా ఆపడం ఆయన వల్ల అవుతుందా అన్నదే ధర్మ సందేహం. ఆయనకు ముందు ఉన్న ఉక్కు మంత్రి అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కావాల్సిందే అని నిండు సభలో చెప్పేశారు.
ఇక మోడీ సర్కార్ తీరు చూసినా ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గేది ఉండదు. కానీ ఒకే ఒక్క ఆశ. విశాఖ ఉక్కుకు ఆశాజ్యోతిగా జ్యోతిరాదిత్య సిందియా నిలిచి కేంద్ర పెద్దలను ఒప్పించాలని, ఒప్పిస్తారని. ఆశభవం వ్యక్తం చేస్తున్నారు.