నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ చరిత్ర చంద్రబాబుది. అలాగే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. బాబు పాలనంతా పారిశ్రామికవేత్తల కోసమే సాగింది. వ్యవసాయ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. రైతులకు సాగునీరు అందించాలన్న ఆలోచన ఆయన పాలనలో ఏనాడూ చేసిన దాఖలాలు లేవు. అందుకే ఆయన్ను రైతు వ్యతిరేకిగా చూస్తారు. ప్రతిపక్షంలో వుంటే తప్ప చంద్రబాబుకు వ్యవసాయం, రైతాంగం గుర్తు రాదు.
ఇప్పుడు మళ్లీ ఆయనకు అధికారం కావాలి. వారసుడైన లోకేశ్‌ను రాజకీయంగా స్థిరపరచాల్సిన బాధ్యత ఆయనపై వుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఎంతో ముందుగానే మినీ మ్యానిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. దాన్ని పట్టుకుని టీడీపీ నాయకులు ఊరూరా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు తన మ్యానిఫెస్టోకు చక్కటి పేరు పెట్టారు.
చంద్రబాబు అధ్వాన పాలనకు టీడీపీ మ్యానిఫెస్టోనే నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అవతరించిన తర్వాత అత్యధిక కాలం ఆ పార్టీనే ఏపీని పాలించింది. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి నాయకుడు ఇప్పుడు పూర్ టు రిచ్ అని నినదిస్తూ పేదలను ధనవంతులు చేయడమే ఆశయమని నమ్మబలుకుతున్నారు. 2024లో అధికారం ఇస్తే ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చంద్రబాబు గొప్పలు చెప్పడం గమనార్హం. మరి 14 ఏళ్ల పాలనలో ఏం చేసినట్టు? అప్పుడు పేదలకు ఎంతోకొంత సాయం చేసి వుంటే, వాళ్లంతా ఇంకా పేదరికంలో మగ్గాల్సిన దుస్థితి ఎందుకు వచ్చి వుండేది?
బీసీలకు రక్షణ చట్టం తెస్తానని హామీ ఇచ్చారు. టీడీపీకి బీసీలే వెన్నెముక అని పేరు. టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురావాలన్న స్పృహ, ఆలోచన ఇంత కాలం ఎందుకు రాలేదు. అధికారం లేకపోతేనే బీసీలు గుర్తుకొస్తారా? బీసీల కోసం ఏమీ చేయలేదనేందుకు ఈ హామీ ఉదాహరణ కాదా?
తాను అధికారంలోకి రాగానే ఇంటింటికీ మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు దుర్మార్గ పాలనకు ఇంత కంటే ఉదంతం ఏం కావాలి? 14 ఏళ్ల పాలనలో కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు తన మినీ మ్యానిఫెస్టో ద్వారా జనానికి చెప్పకనే చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ ఏమీ చేయకుండా, మళ్లీ ఇప్పుడు గెలిపిస్తే అద్భుతాలు సృష్టిస్తాననడం చంద్రబాబుకే చెల్లింది.
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2014లో రైతులకు చంద్రబాబు హామీలు, వాటి అమలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంక్‌ల్లో కుదవ పెట్టిన బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అని చంద్రబాబు గొప్పలు చెప్పారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు. ఇక బ్యాంక్‌ల్లో బంగారాన్ని తీసుకురావాలని అడిగితే, తానెప్పుడు చెప్పానని చంద్రబాబు బుకాయించారు. దీంతో రైతుల విషయంలో వెన్నుపోటు బాబుగానే మిగిలిపోయారు. తన ద్రోహాన్ని మరిచిపోయి ఏం చెప్పినా నమ్మి ఓట్లేస్తారని రైతులను రూ.20 వేల ఇస్తానని హామీ ఇవ్వడం బాబుకే చెల్లింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాపీ కొట్టేందుకు చంద్రబాబు ఏ మాత్రం వెనుకాడడం లేదు. మహిళా మహాశక్తి అంటూ జగన్ పథకాలకు తన మార్క్ పేరు పెట్టి జనం ముందుకు వెళ్లడం గమనార్హం. అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అని, అలాగే వైఎస్సార్ చేయూత పథకానికి స్త్రీనిధి అని పేరు మార్చి మహిళా ఓటర్ల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టిన ఘనత చంద్రబాబుదే. ప్రభుత్వ ఉద్యోగం వద్దు, ప్రైవేటే ముద్దు అని ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టిన పాలకుడెవరంటే చంద్రబాబే. ఆయన గారిప్పుడు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలుకుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలే ఊసే లేదు. పాలన చివరి రోజుల్లో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించి, చేతులు దులుపుకున్న పాలకుడు చంద్రబాబునాయుడు.
ఇప్పుడేమో అధికారం ఇస్తే భవిష్యత్‌కు గ్యారెంటీ ఇస్తానని భారీ డైలాగ్‌లు కొడుతున్నారు. ఎవరి భవిష్యత్‌కు చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారు? చంద్రబాబు పాలనను 14 ఏళ్లు చూసిన తర్వాత కూడా, మరోసారి ఆయనే కావాలని కోరుకుంటారా? బాబు పాలన ఎలా వుంటుందో గతానుభవాలు చెబుతున్నాయి. బాబు మన భవిష్యత్‌కు గ్యారెంటీ ఇస్తానని హామీ ఇస్తుంటే… హవ్వా అని జనం నవ్వుకుంటున్నారు.