ఇవాళ టీచర్స్ డే. మాజీ రాష్ట్రపతి సర్వే పల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం భారత జాతి గురువుల సేవలను స్మరించుకుంటోంది. గురువులను సత్కరించుకుంటోంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల సేవలను గుర్తించి ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో వారిని ఘనంగా సత్కాలు చేయడం సంతోషించదగ్గ విషయం.
మన సమాజం గురువుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. తల్లిదండ్రుల తర్వాత స్థానమే గురువుదే. విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమైంది. ఈ నేపథ్యంలో గురువులకు ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పారు.
“భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ, ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో దృఢ సంకల్పంతో కృషి చేస్తున్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నివాళులు” అని జగన్ ట్వీట్ చేశారు.
జగన్ ప్రభుత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జగన్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆంగ్ల విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే జగన్ ఇవాళ ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెప్పారు.