ఏపీకి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశానని, అలాగే సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా పని చేసిన ఘనత తనకు మాత్రమే దక్కుతుందని చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటారు. ఆయన మాటల్ని ఎవరూ కాదనలేదు. ఉమ్మడి, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు ఎన్నో పదవులను ఇచ్చింది. నిజానికి ప్రజాకర్షణ లేని చంద్రబాబుకు అదృష్టం కలిసొచ్చింది. తనకు ఎన్నో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు ఆయన ఏమిచ్చారనే ప్రశ్నకు… సమాధానం నిల్.
కనీసం ఆంధ్రప్రదేశ్‌లో నారావారిపల్లెలో మినహాయిస్తే, విజయవాడలో సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. అందుకే ఏపీకి ఆయన గెస్ట్ పొలిటీషయన్ అయ్యారనే విమర్శ. ఈ నేపథ్యంలో ప్రజానీకంతో పాటు టీడీపీ శ్రేణుల మనోభావాలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలిసొచ్చింది.
జగ్గంపేట పర్యటనలో ఓ మాజీ సర్పంచ్ ఆయనకు సొంతింటి ఆవశ్యకతను వివరించారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం మాజీ సర్పంచ్ ప్రశాంత కుమార్ హలోనిన్ (కన్నబాబు) మాట్లాడుతూ …ఇది నా ఒక్కడి విన్నపం కాదంటూనే చంద్రబాబుకు చెమలు పట్టించారు. ఏపీలో ఇల్లు కట్టుకోవాలని చెప్పడం వరకే ఆయన పరిమితం కాలేదు. కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే నివాసం ఉండాలని తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఇది టీడీపీ కార్యకర్తలందరీ విన్నపమని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా టీడీపీ, జనసేన అధిపతులు తీరు వ్యవహార శైలి వుంది. హైదరాబాద్‌లో వుంటూ, చుట్టపు చూపుగా ఏపీకి వస్తున్నారు. సభలో, సమావేశాలో నిర్వహించడం, ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లిపోవడం అలవాటుగా మారింది. మరోవైపు జగన్ రాజధాని ప్రాంతంలో ఎన్నికల కంటే ముందే ఇల్లు కట్టుకున్నారు. అక్కడే నివాసం ఉంటున్నారు.
అమరావతిపై అచంచల ప్రేమ కురిపించే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాత్రం అక్కడ సొంతింటిని ఎందుకు నిర్మించుకోలేదనే ప్రశ్నకు సమాధానం మాత్రం వుండదు. చివరికి సొంత పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు కూడా ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకున్నారు. అయ్యా చంద్రబాబూ… వినరో భాగ్యము సొంతింటి కథ అని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.