రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని.. వారాహితో దసరా తర్వాత ప్రజల ముందుకు వస్తున్నా అని చెప్పిన సినీ నటుడు కమ్ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ శివరాత్రికి రాలేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
వారాహితో ప్రజల్లోకి వెళ్లే కంటే ముందుగా అనుష్టుప్ నారసింహ యాత్రను(32 నారసింహ క్షేత్రాల సందర్శన) శ్రీకారం చుట్టి ఒక రోజు తెలంగాణలో, ఒక రోజు ఆంధ్రలో హడావుడి చేసిన తర్వాత పవన్ ఎక్కడా కనపడటం లేదంటూ వాపోతున్నారు జనసైనికులు.
దసరా పండగ తర్వాత మంచి ముహుర్తం చూసుకొని ప్రజల ముందుకు వస్తారని భావించిన జన సైనికులు… శివరాత్రికి కూడా పవన్ బయటికి రాకపోవడంతో డీలా పడ్డారు. ఏదో పిడిఎఫ్ లేదా ఎవరో రాసిన దానికి ట్వీట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారు. అప్పడప్పుడు జనసేన పార్టీ నెంబర్ 2 గా భావిస్తున్న నాదెండ్ల మనోహర్ మాత్రం రాష్ట్రానికి వచ్చి కనీసం పార్టీ అఫీసులో కూర్చొని నాయకులకు హిత బోధ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం ప్రజల్లోకి కాదా.. కనీసం పార్టీ అఫీసుల దగ్గరకు కూడా వెళ్లలేకపోతున్నారు. బహుశా వచ్చే వారాంతంలో పవన్ ఏదో ఒక సమస్య అంటూ మంగళగిరి పార్టీ ఆఫీసులో కనపడవచ్చు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
చేతిలో అర డజను సినిమాలు పెట్టుకుని ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వస్తారు అనుకోవడమే పొరపాటే అంటున్నారు జనసైనికులు. ఒక వైపు టీడీపీలో చిన బాబు.. పెద్ద బాబులు ఇద్దరు ప్రజల్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అనే భావన కూడా ఉంది టీడీపీ శ్రేణుల్లో. ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందు వారాహితో ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబును సీఎం చేయండి అంటూ అడుగుతారంటున్నారు వైసీపీ నేతలు.