ఏపీ బీజేపీ నుంచి వెళ్లిపోవడం కన్నా లక్ష్మీనారాయణతో అంతం కాదు. కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే బీజేపీపై ప్రేమతో ఆ పార్టీలోకి వెళ్లి వుంటే… సుదీర్ఘ కాలం పాటు కొనసాగేవారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రకరకాల స్వార్థ ప్రయోజనాలతో ఆ పార్టీని ఆశ్రయించారు. ఇది జగమెరిగిన సత్యం.
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఏపీలో కనీసం ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీలోకి వెళ్లారంటే ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబునాయుడు తన స్వార్థం కోసం నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపారనే వాదన లేకపోలేదు. అందుకే వారిపై కనీసం అనర్హత వేటు వేయాలని కూడా టీడీపీ నేతలు ఎప్పుడూ రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేయకపోవడాన్ని గమనించొచ్చు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతలు తమకు అనుకూలమైన పార్టీల్లోకి జంప్ చేయడం మొదలైంది. బీజేపీలో వుంటే తనకు రాజకీయ భవిష్యత్ వుండదనే ఉద్దేశంతో కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడారు. త్వరలో ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోతూపోతూ సోము వీర్రాజుపై ఓ నిందవేశారు. కన్నా బీజేపీలోకి వెళ్లే నాటికే ఆ పార్టీలో సోము వీర్రాజు సీనియర్ లీడర్. సోము వీర్రాజుపై ఆరోపణలు కేవలం సాకు మాత్రమే.
రాజకీయ స్వార్థంతో బీజేపీలో చేరిన వాళ్లంతా ఆ పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్ తదితరుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీని వీడే నాయకులెవరో ఆ పార్టీ ముఖ్యులకు బాగా తెలుసు. కన్నా మాదిరిగా పార్టీకి నష్టం చేయాలనే ఆలోచనలో ఎవరూ లేరని సమాచారం.
కన్నాకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే బీజేపీ చేసిన అతిపెద్ద తప్పిదం. భవిష్యత్‌లో అలాంటి తప్పు చేయకూడదనే గుణపాఠాన్ని కన్నా ఎపిసోడ్ నుంచి బీజేపీ నేర్చుకుంది. ఎన్నికలు సమీపించే నాటికి ఏపీ బీజేపీ నుంచి పోయే వాళ్ల గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వుంటుంది. బీజేపీలో టీడీపీ అనుకూల నేతలే ఎక్కువగా పార్టీ మారే అవకాశాలున్నాయి.