తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కేసీఆర్కు సొంత వాళ్లు శుభాకాంక్షలు చెప్పడంలో పెద్ద విశేషం లేదు. కానీ ఆయన అంటే గిట్టని వారి నుంచి శుభాకాంక్షలు రావడం విశేషమే. కేసీఆర్కు గవర్నర్ తమిళిసై నుంచి బర్త్డే విషెస్ రావడం సంథింగ్ స్పెషల్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్లిద్దరి వైరం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో, ఏ చిన్న సానుకూల అంశం ఏర్పడినా ప్రత్యేకంగా చెప్పుకుంటారు.
కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసై మధ్య గత కొన్ని నెలలుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇది అవాంఛనీయమే అయినా, వాస్తవ పరిస్థితుల్ని ఎవరూ కొట్టి పారేయలేరు. ఇటీవల బడ్జెట్ సమావేశాలకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కొనసాగించాలని కేసీఆర్ సర్కార్ వ్యూహం పన్నింది. అయితే గవర్నర్ తమిళిసై తగ్గేదే లేదంటూ గట్టి పట్టుదలతో ఉండింది. దీంతో ఆమె అనుమతి లేనిదే బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి. చివరికి ఈ పంచాయితీ న్యాయ స్థానానికి చేరింది.
తెలంగాణ హైకోర్టు సూచనతో తెలంగాణ సర్కార్ ఓ మెట్టు కిందికి దిగింది. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు అంగీకరించింది. ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వెళ్లిన గవర్నర్కు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సర్కార్ రాసిన ప్రసంగ పాఠాన్ని తమిళిసై చదివారు. దీంతో సర్కార్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతానికి ఇరువైపుల నుంచి ఎలాంటి రెచ్చగొట్టే మాటలు రావడం లేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కేసీఆర్కు గవర్నర్ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఈ మేరకు తమిళిసై ట్వీట్ చేశారు. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు” అని ఏక వాక్యంలో ట్వీట్ చేసి తమిళిసై తన సంస్కారాన్ని చాటుకున్నారు. ఇలా ఒక్కొక్కటిగా వాళ్ల మధ్య విభేదాలను తొలగించేందుకు కారణాలవుతున్నాయి. తెలంగాణ సమాజం కోరుకుంటున్నది కూడా ఇదే.