టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కామెడీ చేస్తున్నారు. కామెడీ ఎప్పటి నుంచి చేస్తున్నార్ సార్? అనే సరదా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో టీడీపీ భవిష్యత్ రథసారథి భేటీ అయ్యారని, త్వరలో ఎన్డీఏలో టీడీపీ చేరుతుందని వార్తా కథనాలు వండి వార్చిందెవరో తెలుగు సమాజానికి బాగా తెలుసు. సదరు మీడియా సంస్థలు ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పిల్లల్ని అడిగినా ఠకీమని జవాబు చెబుతారు.
కానీ ఆ విషయమై తాజాగా చంద్రబాబు కామెడీ ఏంటో తప్పక తెలుసుకోవాల్సిందే. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని కాసేపటి క్రితం బీజేపీ జాతీయ నాయకుడు లక్ష్మణ్ తేల్చి చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు ప్రకటన హాస్యాస్పదంగా మారింది. ఎన్డీఏలో టీడీపీ చేరుతుందన్న ప్రచారంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారట! అంతేనా, అసలు ఆ ప్రచారం చేస్తున్న వాళ్లే జవాబు చెప్పాలని ఆయన అనడం కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది.
లక్ష్మణ్ లేదా బీజేపీ జాతీయ నాయకులు వరుసగా మొటిక్కాయలు వేస్తే తప్ప, ఆ ప్రచారాన్ని చంద్రబాబు ఎందుకు ఖండించలేదు? అలాగే అమిత్‌షాతో భేటీపై లోకేశ్ ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకొచ్చి జాతినుద్దేశించి ప్రసంగించే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్… బీజేపీ అగ్రనేతలతో చర్చలు, ఎన్డీఏలో చేరికపై మాత్రం ఎందుకు నోరు మెదపలేదనే ప్రశ్నలకు సమాధానం ఏంటి?
ఇప్పుడు తగదునమ్మా అంటూ అభాసుపాలయ్యాక, అబ్బే తమకేం తెలియదని చంద్రబాబు చెప్పడం విడ్డూరం కాక మరేంటి? గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటికొచ్చామని చంద్రబాబు చెప్పడం విశేషం. మరిప్పుడు ఎన్డీఏలో కలవాలని అనుకోవడం కూడా రాష్ట్ర ప్రయోజనాల్లో భాగమా? లేక టీడీపీ లాభం కోసమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండు సార్లు నష్టపోయిందని చంద్రబాబు మాటలు కామెడీ కాక మరేంటి?
అలాగే రాష్ట్రానికి మంచి పేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయినట్టు చంద్రబాబు చెప్పడం గమనార్హం. వినేవాళ్లుంటే చంద్రబాబు ఎన్నైనా, ఏమైనా చెబుతారంటే ఇదే కాబోలు. చంద్రబాబు నష్టపోవడమా? ఇది జరిగే పనేనా? ఇతరులకు నష్టం కలిగించైనా లాభం పొందడం చంద్రబాబు నైజమని టీడీపీ వాళ్లే చెబుతారు. అలాంటిది తన మనస్తత్వానికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు సుద్ధులు చెబుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.