ఢిల్లీ మీడియాలో ఎక్కడో చిన్న వార్త రావాలి. అది మనవాళ్లకు ఎవ్వరికీ కనిపించదు కానీ దేశం అనుకూల మీడియాకు మాత్రం కనిపించేస్తుంది. దాన్ని పట్టుకుని సాయంత్రం వేళ డిస్కషన్లు షురూ అయిపోతాయి. మళ్లీ అలా అని అందరూ ఒకేసారి డిస్కషన్లు పెడితే జనాలకు రీచ్ కాదనేమో వేరు వేరుగా డిస్కషన్లు షురూ చేస్తారు.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు, అక్కడ చిన్న వార్త రావడం భయం, ఇదిగో తెలుగుదేశం-భాజపా పొత్తు కుదిరిపోయిందోచ్ అంటూ డప్పు కొట్టేస్తారు. అంటే దీన్ని బట్టి ఈ చానెళ్లు అన్నీ తెలుగుదేశం-భాజపా పొత్తు మీద ఎంత తహ తహలాడుతున్నాయో అర్థం అయిపోతుంది.
కానీ పాపం, ఎప్పటికప్పుడు భాజపా నుంచి క్లారిటీ వస్తూనే వుంది. అయినా ఈ తహ తహ ఆగదు. మొన్నటికి మొన్న ఒక ప్రయత్నం చేసారు. అమిత్ షాను లోకేష్ కలిసాడు అంటూ. నిజానికి నిజంగా లోకేష్ అమిత్ షాను కలిసి వుంటే ఎంత హడావుడి చేసేవారు. ఎన్టీఆర్ కలిసాడు. కానీ లోకేష్ కు అపాయింట్ మెంట్ లేదు. ఆ బాధ ఎంతో వుంది. అందుకోసమే ఆ ఫీలర్ కావచ్చు. దాంతో హడావుడి జరిగిపోయింది.
ఆ తరువాత జాతీయ మీడియాలో ఎక్కడో చిన్న టుమ్రీ లాంటి వార్త వచ్చింది. ఇక దాన్ని పట్టుకుని అంతా అయిపోయింది. అదికో కాషాయం..పసుపు కలిపిన కొత్త జెండా కనిపిస్తోంది అన్నంత హడావుడి చేసేసారు.
ఆ పైన ఎక్కడో మళ్లీ అలాంటి గ్యాసిప్. దాంతో మళ్లీ హడావుడి…ఇలా మూడు రోజులు మూడు డిస్కషన్లు జరిగిపోయాయి. కానీ ఇప్పుడు భాజపా కేంద్ర పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు లక్షణ్ నే క్లారిటీ ఇచ్చేసారు. భాజపా-తేదేపా పొత్తు మీడియాలో తప్ప వాస్తవంగా లేదని కుండ బద్దలు కొట్టేసారు. తెలుంగాణలో ఒంటరి పోరే అని స్పష్టం చేసారు. ఆంధ్రలో పవన్ తో కలిసి ముందుకు వెళ్తామన్నారు.
మరి ఇప్పుడు కూడా డిస్కషన్ పెట్టాలి కదా..లెక్క ప్రకారం. లేదూ అంటే మళ్లీ మరోసారి ఎక్కడో ఓ జాతీయ మీడియాలో ఓ టుమ్రీ వార్తను సృష్టించి అప్పుడు మళ్లీ మొదలు పెడతారేమో బాజాలు వాయించడం.