బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్-6కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 4న షో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ప్రోమోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. మరోసారి హోస్ట్‌గా హీరో నాగార్జున వ్యహరించనున్నారు. ఈ దఫా బిగ్‌బాస్ షోలో మొత్తం 19 మంది కనిపించనున్నారు. వీరిలో బుల్లితెర దంపతులు రోహిత్-మెరీనా అబ్రహం కూడా ఉన్నారని సమాచారం. ఈ దఫా ఓ సామాన్యుడు ఉంటాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇంకా స్పష్టత లేదు.
కానీ ఉన్నంతలో కామన్ మ్యాన్ సెలబ్రిటీగా యూట్యూబర్ ఆదిరెడ్డిని పరిగణించొచ్చు. బిగ్‌బాస్ రియాల్టీ షోలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తూ నెటిజన్లకు బాగా పరిచయమైన వ్యక్తులు ఆదిరెడ్డి, గలాట గీతూ ఈ దఫా అదే షోకు ఎంపికయ్యారని తెలిసింది. ముఖ్యంగా ఆదిరెడ్డి నేపథ్యం చూస్తే మన పక్కంటి అబ్బాయి అనే భావన కలుగుతుంది.
సింగర్ రేవంత్, అర్జున్ కల్యాణ్, నువ్వు నాకు నచ్చావ్ సుదీప, చలాకీ చంటి, నటుడు శ్రీహాన్, నేహా చౌదరి తదితరులు వెళ్లనున్నారు. వీళ్లంతా వెండితెరపై ఇష్టాన్ని పెంచుకుని కెమెరా ముందుకు వెళ్లిన వారే. కానీ సరదాగా బిగ్‌బాస్ రియాల్టీ షోపై విశ్లేషణతో మొదలైన ప్రస్థానం చివరికి అదే షోకు ఎంపిక కావడం వరకూ ఆదిరెడ్డి ప్రస్థానం సాగింది. అతని కుటుంబ నేపథ్యం మామూలు మధ్యతరగతికి చెందింది. అతని గుర్తింపు పొందిన తీరు చూస్తే… కళ్లెదుటే ఒక్కో మెట్టు ఎదుగుతూ వెళ్లారు.
ఆదిరెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు. వ్యవసాయ కుటుంబం. ఆదిరెడ్డికి తల్లిదండ్రులతో పాటు అన్న, అక్క, చెల్లి ఉంటారు. నెల్లూరులో డిగ్రీ చదువుతూ చివరి ఏడాది మానేశారు. అదే సమయంలో వైఎస్సార్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం అతనిలో ఇంజనీరింగ్ చదివేందుకు బీజం వేసింది. అలా బీటెక్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్స్‌లో రూ.10 వేల ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
పేపర్లో తన ఫొటోను చూసుకుని మురిసిపోయారు. తల్లిదండ్రులు కూడా సంతోషించారు. ఉద్యోగంలో చేరాలని భావిస్తున్న తరుణంలో అమ్మ మరణం అతనికి షాక్ ఇచ్చింది. అది కూడా ఆత్మహత్యకు పాల్పడడం కుంగదీసింది. దీంతో ఉద్యోగానికి వెళ్లలేదు. రెండేళ్లపాటు ఇంటిపట్టునే ఉన్నారు. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం బెంగళూరు వెళ్లారు. ఒకవైపు అప్పులు, మరోవైపు కుటుంబ పోషణ భారమైంది.
బతకడం చేతకాదని తండ్రి, బంధువుల పెదవి విరుపు మాటలు అతన్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న సమయంలో బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్-2 ప్రసారమయ్యేది. మిత్రుడి సూచన మేరకు ఆ షోపై తనదైన రీతిలో సరదాగా వీడియో చేశాడు. కౌశల్‌పై చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. సొంతంగా తన పేరుతోనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశారు. అప్పుడు మొదలైన విశ్లేషణలు బిగ్‌బాస్ సీజన్ 5, అలాగే ఓటీటీ షోపై కూడా కొనసాగించారు.
నెటిజన్లు ఆదరించారు. మరోవైపు యూట్యూబ్‌లో సంతృప్తికర స్థాయిలో ఉపాధి దొరికింది. వరికుంటపాడులో ఇంటర్నెట్ ఇబ్బంది పెడుతుండడంతో కావలికి మకాం మార్చారు. అంధురాలైన చెల్లి నాగలక్ష్మి, భార్య కవిత పేర్లతో మరో యూట్యూబ్ చానల్ మొదలు పెట్టారు. కరోనా సమయంలో సోనూసూద్ సాయానికి తన వంతుగా నాగలక్ష్మి రూ.15 వేలు అందించి శభాష్ అనిపించుకున్నారు. అంధురాలైన నాగలక్ష్మి సాయం వెలకట్టలేనిదంటూ సోనూసూద్ చేసిన ట్వీట్ దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించింది.
తన భార్య, చెల్లి నడుపుతున్న యూట్యూబ్ చానల్లో ఆదిరెడ్డి తరచూ కనిపిస్తుంటారు. ఒకప్పుడు ఎలా బతుకుతాడో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందిన దశ నుంచి అతనో రోల్ మోడల్‌గా నిలవడం విశేషం. ఇప్పుడాయన బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ హౌస్‌లో ఎంత కాలం కొనసాగుతారు? ఆటతీరు ఎలా వుంటుంది? తదితర ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఇంత కాలం అందరి ఆటపై మంచీచెడుల గురించి చెబుతూ వచ్చిన ఆదిరెడ్డిపై అందరి దృష్టి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఓ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆదిరెడ్డిలో మాత్రం మనల్ని మనం చూసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.