తెలుగుదేశం పార్టీతో చెట్టపట్టాలు వేసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్న పవన్ కల్యాణ్.. రాజకీయ ప్రస్థానంలో కూడా తెలుగుదేశం లాగానే అయిపోయేలా కనిపిస్తున్నారు. ఆయన ఆరాధిస్తున్న సదరు తెలుగుదేశం తెలంగాణలో శవాసనం వేసి అంతర్ధానం అయిపోయింది.
తాజాగా పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా అదే! జనసేన తెలంగాణ పార్టీ బతికి ఉన్నదని చెప్పుకోవడానికి ఆయన అప్పుడప్పుడూ ఒక కార్యక్రమం, ఒక కార్యకర్తల సమావేశం నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. తెలంగాణలో ఆ పార్టీని నమ్ముకుని కొందరు కార్యకర్తలు ఉన్నారు. ఏదో ఒక నాటికి తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్నారు. కానీ.. తాజా పరిణామాలు గమనిస్తోంటే.. జనసేన తెలంగాణ దుకాన్ బంద్ అన్నట్లుగానే కనిపిస్తోంది.
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ తాజాగా తమ పార్టీ వ్యూహాలను వెల్లడించారు. ఎన్డీయేలోకి తెలుగుదేశం కూడా వస్తుందనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. అదంతా ఆ పార్టీ వారే చేసుకుంటున్న ప్రచారం అని ధ్వనించేలా సెటైర్లు వేశారు. జనసేన ఊసెత్తలేదు గానీ.. తెలంగాణలో తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని సెలవిచ్చారు. మరో రకంగా చెప్పాలంటే.. తెలంగాణకు సంబంధించినంతవరకు జనసేన అస్తిత్వాన్నే ఆయన గుర్తించలేదనాలి. అదే సమయంలో, ఏపీలో జనసేనతో కలిసిపోటీచేస్తాం అనడం విశేషం.
అంతో ఇంతో గెలుపు అవకాశాలు ఉన్న తెలంగాణలో మాత్రం.. జనసేనను దగ్గరకు రానివ్వకుండా.. వారికే ఒక్క సీటుకైనా దిక్కులేని ఏపీలో మాత్రం, జనసేనతో కలిసి పోటీచేస్తాం అనడమే పెద్ద కామెడీ.
ఎన్డీయే కూటమిలో భాగస్వామి అంటే.. నిర్వచనం ఏమిటో ప్రజలకు మాత్రం బోధపడ్డం లేదు. ఎన్డీయే తమ భాగస్వాములు తమకు ఉపయోగపడే చోట మాత్రం.. వారిని పల్లకీ బోయీలుగా వాడుకుంటూ.. తమకు సొంతంగా బలం ఉన్న చోట వారిని కరివేపాకులా తీసి పక్కన పారేస్తోంది. బిజెపి దృష్టిలో భాగస్వామ్య ధర్మం అంటే అవసరానికి వాడుకుని పక్కన పారేయడం మాత్రమే అన్నట్లుగా కనిపిస్తోంది.
ఇలాంటి బిజెపి పట్ల పవన్ కల్యాణ్ ఎప్పటికి మేలుకుంటారో ఏమో కార్యకర్తలకు మాత్రం అర్థం కావడం లేదు. చిటుకుమంటే.. నాకు మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు అని గప్పాలు కొట్టుకునే పవన్ కల్యాణ్ తెలంగాణలో కూడా బిజెపితో పొత్తుల్లో కొన్ని సీట్లు తీసుకుని శాసనసభ ఎన్నికల్లో పోటీచేయగలరా? లేదా? అలా చేయలేకపోతే.. తెలంగాణకు సంబంధించినంతవరకు జనసేన దుకాన్ బంద్ అయినట్లే భావించాల్సి ఉంటుంది.