ప్రచారం చేసింది మీ వాళ్లేగా

తెలుగుదేశం పార్టీ ఎన్టీయే లో చేరుతుందని ఎవరు ప్రచారం చేసారో వాళ్లనే అడగండి అనేసారు చంద్రబాబు నాయుడు.  Advertisement ఇంక అంత మాట అన్నాక కూడా ఇంకేం అనాలి. అసలు తెలుగునాట ఆ ప్రచారం…

తెలుగుదేశం పార్టీ ఎన్టీయే లో చేరుతుందని ఎవరు ప్రచారం చేసారో వాళ్లనే అడగండి అనేసారు చంద్రబాబు నాయుడు. 

ఇంక అంత మాట అన్నాక కూడా ఇంకేం అనాలి. అసలు తెలుగునాట ఆ ప్రచారం సాగించింది ఎవరు? వైకాపా వాళ్లు అయితే కాదు కదా? జ‌నసేన వాళ్లు చేస్తారా? వాళ్లకేం అవసరం? మరి ఇంకా హడావుడి అంతా ఎవరిది? ఆ రెండు చానెళ్లదే కదా? ఇప్పుడు అదంతా తెలియనట్లు చంద్రబాబు అలా మాట్లాడతున్నారేంటీ?

అంటే భాజ‌పా పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. భాజ‌పా పొత్తు లేకుండా చంద్రబాబు గెలవలేరు. భాజ‌పా లేకుండా జ‌నసేన దగ్గరకు రాదు. అది రాకపోతే అసలు గెలవలేరు అనే భావన జ‌నాల్లోకి బాగా వెళ్లిపోయింది. 

ఎందువల్ల, సదరు మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం వల్ల కాదా? వాటి వల్ల కదా చంద్రబాబు పరువు పలుచన అయిపోతోంది. అది గమనించినట్లున్నారు. అందుకే చంద్రబాబు ఇలా నాలుక మడతేసారు.

ఎన్టీఎలో చేరడానికి, మంత్రి పదవులకు కూడా ముహుర్తం పెట్టేసాయి తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థలు. తీరా చేస్తే అలాంటిది ఏమీ లేదు అని భాజ‌పా జ‌నాలు చెప్పేసాక, చంద్రబాబు ఇలా ప్రకటించేసారు.పాపం అమిత్ షా ను లోకేష్ కలిసారన్న ఫీలర్ కూడా దీంతో గాల్లో కలిసిపోయింది. 

ఆంధ్ర ప్రయోజ‌నాల కోసం భాజ‌పాకు దూరం జ‌రిగామని చెబుతున్న చంద్రబాబు ఇప్పుడు ఏ ప్రయోజ‌నాలు నెరవేరాయని మళ్లీ దాని చెంతకు చేరగలరు. అందుకే ప్రస్తుతానికి ఇలాంటి స్టేట్ మెంట్ తో సరిపెట్టారు అనుకోవాలి.

పాపం, బాబుగారి అనుకూలం మీడియా చానెళ్ల మోడరెటర్లు రెండు మూడు రోజులు కష్టపడి ఎంత డిస్కషన్లు పెట్టారో. ఒకాయన అయితే మొహంలో ఎంత ఆనందం ప్రకటించారో..అదంతా ఎగిరిపోయినట్లే ప్రస్తుతానికి.