చంద్రబాబునాయుడు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన దందాలన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. పుట్టల్లోంచి పాము పిల్లలు బయటకు వచ్చినట్టుగా వస్తున్నాయి.
ప్రస్తుతానికి కేవలం మూడు కేసుల గొడవ మాత్రమే వినిపిస్తున్నది గానీ.. ఇక్కడితే ఆగే అవకాశం కూడా లేదు. ఇంకా ఎన్ని అవినీతి బాగోతాలు ఉన్నాయో.. ఎన్ని నిగ్గుతేలి ప్రభుత్వం అమ్ముల పొదిలో ఉన్నాయో కూడా తెలియదు. ఇలాంటి నేపథ్యంలో.. ఏ కేసులో బెయిలు వస్తుందో.. ఏ కేసులో బెయిలు రాదో.. తెలియకుండా ఊగిసలాటలో చంద్రబాబునాయుడు మధనపడిపోతున్నారు.
అంగళ్లు వద్ద తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల మీద దాడిచేసిన కేసులో.. చంద్రబాబునాయుడు ఏ1 గా ఉన్నారు. ఆయనే తన మాటలతో పార్టీ కార్యకర్తలను పోలీసుల మీద దాడికి రెచ్చగొట్టారనేది కేసు. ప్రస్తుతానికి ఆ కేసులో ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ఒక బెయిలు వచ్చినంత మాత్రాన చంద్రబాబు జీవితానికి ఊరట లభించినట్టే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఇంకా ఆయన జైలునుంచి బయటకు రాలేదు. బయటే ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిలు లభిస్తే ఖచ్చితంగా ఊరట లభించినట్టే. కానీ చంద్రబాబునాయుడు స్కిల్ కేసులో రిమాండులో ఉన్నారు. ఇప్పటికే దఫదఫాలుగా ఆయన రిమాండును కోర్టు పొడిగిస్తూ వస్తున్నది. ఇంకా ఎంతకాలం ఇలా పొడిగిస్తూ ఆయనను రిమాండులోనే ఉంచుతారో తెలియదు.
మరోవైపు ఆయనను కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఇంకా మిగిలిఉన్నదని సీఐడీ పేర్కొంటోంది. ఈ కేసు సంగతి ఇలా ఉంటే.. అటు ఫైబర్ నెట్ కేసు కూడా ఆయనకోసం వేచి ఉంది. ఆ కేసులో ఆయనను స్వయంగా కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశిస్తూ అందుకు తగినట్టుగా పీటీ వారెంట్ ను కోర్టు అనుమతించింది. అప్పటిదాకా అరెస్టు చేయకుండా ఆపమని మాత్రమే సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
నిజానికి ఫైబర్ నెట్ కేసులో కూడా.. సీఐడీ కోర్టులో హాజరు పరచిన తర్వాత అయినా సరే.. మరోమారు ఆయనను అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. దీంతో రిమాండు ముగిసిపోయి చంద్రబాబు బయటకు వచ్చినా మరోమారు అరెస్టయ్యే అవకాశం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎప్పుడు జైల్లో ఉండాలో.. ఎప్పటికి బయటకు వచ్చే అదృష్టం దక్కుతుందో.. బయటకువ చ్చినా మళ్లీ ఏయే కొత్త కేసుల్లో అరెస్టు కావాల్సి వస్తుందో తెలియక చంద్రబాబునాయుడు మహా ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తోంది.