మర్నాడు దేవ్ భార్య మోనా బొంబాయికి బయలు దేరింది. లండన్ వెళుతున్న భర్తతో ‘‘నిన్న రాత్రి పార్టీలో స్టీవార్ట్ ఏమిటి, నీకేదో హితోపదేశం చేస్తున్నట్లుంది?’’ అని అడిగింది.
‘‘తగిన సబ్జక్టు చూసుకుని ఇంగ్లీషు సినిమాలో కూడా వేస్తే మంచిదంటున్నాడు.’’
‘‘సబ్జక్ట్ ఏదైనా సూచించాడా?’’
‘‘అతనేమీ చెప్పలేదు కానీ మా సంభాషణ విన్న ఒక మిత్రుడు ‘‘గైడ్’’ నవల నీకు పనికి రావచ్చు అని సలహా యిచ్చాడు. అది ఒక డాన్సింగ్ గర్ల్‌కి, టూరిస్టు గైడ్‌కి మధ్య నడిచిన కథట.’’
‘‘చచ్చాంపో, మళ్లీ డాన్సింగ్ గర్ల్ థీమా!? పెర్ల్, టెడ్ వచ్చి అడిగినపుడు అలాటిది వద్దని చెప్పావుగా’’ అని గుర్తు చేసింది మోనా. అప్పుడు వాళ్లు సూచించినది బాలచంద్ర రాజన్ అనే దౌత్యవేత్త, కవిత్వ విమర్శకుడు రాసిన ‘‘ద డార్క్ డాన్సర్’’ అనే నవల. అది దేశవిభజన సమయంలో జరిగిన ఒక నర్తకి కథ.
‘‘అది బొత్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్. దీనిలో హీరోకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందట. నాకు యాక్టింగ్‌కు చక్కటి స్కోప్ ఉంటుందని అన్నాడతను. లండన్‌లో ఉండగా ఆ పుస్తకం గురించి వెతికి చదువుతాను. ’’ అన్నాడు దేవ్.
మోనా కూడా సినిమా రంగానికి చెందినదే. హీరో, హీరోయిన్ల ఎలివేషన్ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. నవకేతన్ వారి ‘‘బాజీ’’ (1951) సినిమాలో దేవ్ సరసన నటించడానికి ఆమె షిమ్లా నుంచి బొంబాయికి వచ్చింది. దేవ్, చేతన్ భాగస్వాములుగా ‘నవకేతన్’ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి మొదటగా ‘‘అఫ్సర్’’ (1950) సినిమా తీస్తే పేరు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. మంచి కమ్మర్షియల్ తీసి హిట్ కొట్టకపోతే సంస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది. అన్నగారు గొప్ప దర్శకుడే అయినా ప్రజలను మెప్పించలేక పోతున్నాడని అర్థమై, తన తొలి చిత్రం ‘‘హమ్ ఏక్ హైఁ’’ (1946)కి అసిస్టెంటు డైరక్టరుగా పని చేస్తూ, స్నేహితుడైన గురుదత్‌ను పిలిచి ‘‘అప్పట్లో నీకిచ్చిన మాట ప్రకారం నీకు తొలిసారిగా దర్శకత్వం చేసే ఛాన్సు యిస్తున్నాను. మంచి కథ చూడు.’’ అన్నాడు.
1940, 50లలో హాలీవుడ్‌లో నువా (Noir) సినిమాలని వచ్చేవి. వాటిలో హీరో సచ్ఛీలుడు, ధర్మం తప్పనివాడు కాదు. స్వతహాగా మంచివాడే అయినా పరిస్థితుల ప్రభావం చేత చట్టవిరుద్ధమైన పనులు చేస్తాడు, నేరాలకు పాల్పడతాడు. హీరోయిన్ కూడా కులీనురాలు, ముగ్ధ కాదు. అండర్‌వ(ర)ల్డ్‌తో సంపర్కం పెట్టుకుంటుంది. సినిమాలో దొంగలు, హంతకులు, అధో జగత్తులో మసలే మగాఆడా ఎక్కువమంది ఉంటారు. చివర్లో మంచి గెలిచినా, ముఖ్యపాత్రలందరికీ ఏదో ఒక మచ్చ ఉంటుంది. రాముడు మంచిబాలుడు వంటి సినిమాలు చూసిచూసి విసుగెత్తిన సామాన్య ప్రేక్షకులకు యీ తరహా సినిమాలు నచ్చాయి. ఎందుకంటే వారిలో చాలామంది స్వభావరీత్యా మంచివాళ్లే అయినా కాస్తోకూస్తో చెడు అలవాట్లు ఉన్నవారు. గత్యంతరం లేక అప్పుడప్పుడు చెడ్డ పనులకు పాల్పడేవారు. ఈ సినిమాలలో హీరోహీరోయిన్లతో వాళ్లు మమేకం అయి, సినిమాలను ఆదరించారు.
అలాటి జానర్ సినిమాలు ఇండియాలో అప్పటికి తయారు కావటం లేదు. దేవ్‌కు అలాటి యిమేజి యిస్తూ సినిమా తీస్తే బాగుంటుందని గురుదత్ అనుకున్నాడు. నటుడు బలరాజ్ సాహ్నితో కలిసి కథ రాశాడు. తక్కిన రచన, స్క్రీన్‌ప్లే బలరాజ్ సాహ్ని చూసుకున్నాడు. గురుదత్ దర్శకత్వం వహించాడు. ఒకప్పుడు ధనిక కుటుంబానికి చెందిన హీరో ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. క్షయతో బాధపడే చెల్లెలుంది. సంపాదన లేక జూదం ఆడ నారంభించాడు. ఇతనిది లక్కీ హేండ్ అని గమనించిన అండర్ వ(ర)ల్డ్ బాస్ ఒకతను యితన్ని ఓ క్లబ్బుకి పిలిపించాడు. అక్కడ హీరోయిన్ ఓ డాన్సర్. కస్టమర్లలో ధనికులను జూదం (బాజీ అంటే జూదం అని అర్థం) ఆడమని ప్రోత్సహించడం ఆమె పనైతే, వారిని పందెంలో ఓడించడం హీరో పని. దీన్నంతా నిర్వహించే బాస్ ఎవరికీ కనబడడు. హీరో యీ ఆఫర్‌ను తిరస్కరించి వచ్చేశాడు.
ఒక లేడీ డాక్టరు పేదల వాడలో ఆసుపత్రి పెట్టి నడుపుతూంటుంది. హీరో చెల్లెలికి చికిత్స చేస్తూంటుంది. ఆ సందర్భంగా హీరోతో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు కానీ అది ధనిక వ్యాపారస్తుడైన ఆమె తండ్రికి నచ్చలేదు. ఒక ఇన్‌స్పెక్టరుకి యిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాడు. హీరో చెల్లెలి చికిత్సకై పెద్దమొత్తంలో డబ్బు అవసరమైంది. దాని కోసం హీరో క్లబ్బులో జూదరి పనికి ఒప్పుకున్నాడు. అక్కడ పని చేస్తూండగానే ఓ రోజు డాన్సర్ హత్యకు గురైంది. ఆ నేరం హీరోపై పడి, జైలుకి వెళ్లాడు. ఇన్‌స్పెక్టర్ విచారణ ప్రారంభించాడు. తేలిందేమిటంటే ఆ బాస్ డాక్టరు తండ్రే. కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కోపంతో హీరోని చాటుగా తుపాకీతో చంపబోయి, పొరపాటున అడ్డువచ్చిన డాన్సర్‌ను కాల్చేశాడు. అప్పుడు ఇన్‌స్పెక్టరు ఒక నాటకమాడి, హీరోని కాపాడి, విలన్‌ను జైలుకి పంపుతాడు. హీరో, డాక్టరు పెళ్లాడతారు.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో దేవ్‌కు యీ యిమేజి స్థిరపడిపోయింది. అనేక సినిమాల్లో యీ తరహా పాత్రలే వేశాడు. ఈ సినిమాలో డాన్సర్‌గా ఉల్లాసానికి, ఉత్తేజానికి మారుపేరైన గీతా బాలి నటించింది. చివర్లో హీరోని పెళ్లాడిన డాక్టరు పాత్రకు నటీమణిని వెతుకుతున్నారు. చిన్న పాత్రే అయినా అందంగా, హుందాగా ఉండాలామె. చేతన్ భార్య ఉమా లాహోరుకి చెందిన బెంగాలీ క్రిస్టియన్. ఆమె తల్లికి బంధువు గురుదాస్‌పూర్‌లో తాసిల్దారుగా పని చేస్తున్న ఒక పంజాబీ క్రైస్తవుణ్ని పెళ్లాడింది. వాళ్లకి ఐదుగురు కొడుకులు, యిద్దరు కూతుళ్లు. అందరి కంటె చిన్నది మోనా సింఘా. 1931లో పుట్టింది. దేశవిభజన సమయంలో కుటుంబం షిమ్లాకు వచ్చేసింది. మోనా అక్కడే కాలేజీలో చదువుతూ అందాల పోటీలో పాల్గొంటే ‘మిస్ షిమ్లా’ అవార్డు వచ్చింది. చేతన్, ఉమా షిమ్లా వెళ్లినపుడు వాళ్లను కలిశారు. తాము తీయబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర వేయమని మోనాను, ఆమె తల్లిని చేతన్ ఒప్పించి, బొంబాయి రమ్మన్నాడు.
ఆమెతో కలిసి ఫోటో సెషన్ ఏర్పాటు చేసినపుడు దేవ్‌కు ఆమె పరిచయమైంది. నిజంగానే అందగత్తె, హుషారైన 19 ఏళ్ల పిల్ల. సెషన్ తర్వాత జుహూ బీచ్‌కు వెళ్లినపుడు అంతకు ముందు సముద్రం ఎప్పుడూ చూడనందున చిన్న పిల్లలా ఆడింది. దేవ్ తన కంటె 8 ఏళ్లు పెద్దవాడు, పెద్ద స్టారు అన్న జంకు ఏమాత్రం లేకుండా చిలిపిగా అతనిపై నీళ్లు, యిసుక పోసి ఆట పట్టించింది. తనతో సమానంగా బీచ్‌లో పరుగులు పెట్టమంది. ‘‘నిన్ను అఫ్సర్ సినిమాలో చూశాను.’’ అంది. ‘‘దానిలో నేను నీకు నచ్చానా?’’ అని దేవ్ అడిగితే ‘‘ఏదోలే, కానీ యీ సినిమాలో యింకా బాగుంటావు. ఎందుకంటే పక్కన నేను ఉంటానుగా.’’ అని ఉడికించింది. నిజానికి దేవ్ అప్పటికే సురయ్యా అనే ప్రముఖ నటి, గాయనిని ప్రేమించి, ఆ ప్రేమ విఫలమై ఉన్నాడు. వాళ్లిద్దరూ ‘‘విద్యా’’ (1948)తో ప్రారంభించి ఏడు సినిమాల్లో నటించారు. సురయ్యా దేవ్‌ను ప్రేమించినా, కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లికి అంగీకరించలేదు.
చేసేదేమీ లేక దేవ్ ఊరుకున్న సమయంలో మోనా పరిచయమైంది. విద్యావంతురాలు, ఆధునికురాలు ఐన యీమె కేర్‌ఫ్రీ స్వభావం అతనికి బాగా నచ్చింది. ఇద్దరూ దేవ్ కార్లో షికారు కొట్టేవారు. ఓ పక్క సినిమా షూటింగు సాగింది. చేతన్ ఆమెకు ‘కల్పనా కార్తిక్’ అనే స్క్రీన్ నేమ్ పెట్టాడు. సినిమా హిట్ కావడంతో ఆమెకూ బాగా అవకాశాలు వచ్చాయి. కానీ నవకేతన్ సంస్థకే అంకితమైంది. ‘‘ఆంధియాఁ’’ (1952), ‘‘హమ్‌సఫర్’’ (1953), ‘‘టాక్సీ డ్రైవర్’’ (1954), ‘‘హౌస్ నెంబరు 44’’ (1955), ‘‘నౌ దో గ్యారహ్’’ (1957) సినిమాల్లో వేసింది. అన్నీ దేవ్ పక్కనే. ఆ తర్వాత నటిగా వేయడం మానేసి, నవకేతన్‌లో భాగస్వామి అయి, 1963 నుంచి కొన్ని సినిమాలకు అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కూడా ఉంది.
‘‘టాక్సీ డ్రైవర్’’ సినిమా నిర్మాణసమయంలోనే దేవ్, మోనాల పెళ్లి జరిగింది. అంతకుముందు నుంచే మోనాకు దేవ్ అంటే యిష్టం కలగసాగింది. దేవ్‌కు కూడా మోనా పద్ధతులు నచ్చాయి. సురయ్యాను దేవ్ కలిసేనాటికే ఆమె పెద్ద సింగింగ్ స్టార్. చుట్టూ బోల్డు మంది మనుష్యులు, ఆరాధకులు. బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించడం వలన పెద్దగా చదువుకోలేదు. ముస్లిం ఛాందస కుటుంబంలో నుంచి వచ్చినందున అనేక కట్టుబాట్లు. కుటుంబసభ్యుల పెత్తనం మధ్య పెరిగింది. దేవ్‌ది పూర్తిగా భిన్నమైన నేపథ్యం. ఆమె కంటె ఆరేళ్లు పెద్దవాడైనా ఆమె కంటె ఆలస్యంగా సినిమాల్లోకి వచ్చాడు. ఆమెతో పోలిస్తే చాలా చిన్న స్టార్. ఈ వైరుధ్యమే వాళ్లిద్దరినీ ఒకరంటె ఒకరికి ఆకర్షణ కలిగేట్లా చేసింది. సినిమా తారల ప్రేమ వ్యవహారాలకు వాళ్ల కుటుంబసభ్యులు ఎప్పుడూ అడ్డు పడుతూంటారు. బయటివాళ్లు వచ్చి తమ బంగారుబాతును ఎత్తుకుపోతారని వెయ్యి కళ్లతో నిఘా వేసి చూస్తూంటారు. సురయ్యా విషయంలో వాళ్ల అమ్మమ్మ దేవ్‌తో పెళ్లికి ససేమిరా అంది. అతను తొడిగిన ఉంగరాన్ని తీసి సముద్రంలోకి విసిరేసింది. దేవ్ హిందూ కాబట్టి అమ్మమ్మ ఒప్పుకోలేదంటారు. కానీ తర్వాత యింకొకరితో నైనా సురయ్యాకు పెళ్లి చేయలేదు. ఆమె అవివాహితగానే మరణించింది.
‘నా ప్రేమ, నా జీవితం, నా యిష్టం’ అనడానికి బదులు సురయ్యా వాళ్ల ఆంక్షలకు లొంగిపోయి తనను దూరం పెట్టిందని దేవ్ కొంతకాలం బాధపడ్డాడు. తర్వాత తనకోసం అయినవారిని ఎదిరించే తెగింపు లేని అమ్మాయి దక్కకపోతే నష్టమేముంది అనుకున్నాడు. అలాటి తెగింపు మోనాలో పుష్కలంగా ఉంది. తనపై యిష్టాన్ని, ప్రేమను ఏ సంకోచమూ లేకుండా వ్యక్తపరుస్తోంది. ‘‘టాక్సీ డ్రైవర్’’ సినిమా షూటింగు జరిగే రోజుల్లోనే ఆమె బీచ్‌కు తీసుకెళ్లి ‘నన్ను పెళ్లాడతావా లేదా చెప్పు. లేకపోతే నా దారి నేను చూసుకుంటాను.’ అంది. ‘నాక్కాస్త సమయమియ్యి’ అన్నాడితను. ‘అదంతా జాన్తానై. సంగతేదో తేల్చుకునే వెనక్కి వెళదాం.’ అన్నాడు. దేవ్ కాస్సేపు ఆలోచించి ‘అయితే రేపే ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందాం.’ అన్నాడు. ‘ఎంగేజ్‌మెంటేమీ లేదు, ఎకాయెకీ మ్యారేజే. ఎవరికీ చెప్పకుండా చేసుకుందాం. జస్ట్ నువ్వూ, నేనూ, రిజిస్ట్రార్ ఆఫీసులో సాక్షులుగా సంతకం పెట్టే యిద్దరూ, అంతే!’ అందామె. రైఠో అంటే రైఠో అనుకున్నారు.
మర్నాడు రిజిస్ట్రార్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకుని వచ్చారు. రెండు వారాల పాటు వీళ్ల పేర్లు నోటీసు బోర్డులో పెట్టారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. రెండు వారాలయ్యాక ఓ రోజు సినిమా షూటింగు బ్రేక్‌లో కెమెరామన్ లైటింగు సెట్ చేసుకోవడానికి ఒక గంట పడుతుందని చెప్పినపుడు యిద్దరూ చల్లగా బయటకు నడిచి రోడ్డుకి అవతలవైపున్న రిజిస్ట్రారాఫీసుకి వెళ్లి సంతకాలు పెట్టేశారు. దేవ్ తన కోటు జేబులోంచి ఉంగరం తీసి తొడిగేశాడు. వెనక్కి వచ్చి షూటింగులో పాల్గొన్నారు. ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు కానీ, కెమెరామన్ రాత్రాకి మాత్రం తేడా కొట్టింది. ‘ఇందాకా షాట్‌లో యీ ఉంగరం లేదే’ అంటున్నాడు. ‘కనబడకుండా తిప్పి పెట్టుకుంటానులే’ అంది మోనా. ‘అసలు ఆ ఉంగరం…’ అని రాత్రా అంటూ ఉంటే దేవ్ కన్ను కొట్టి సైలెంట్‌గా ఉండమని రిక్వెస్టు చేశాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం గురించి అతనికి ముందే ఐడియా ఉండడంతో సరేలే అని నవ్వుకుని ఊరుకున్నాడు.
తర్వాత క్రమేపీ అందరికీ తెలిసింది. దేవ్ క్రైస్తవురాలిని పెళ్లి చేసుకోవడం వాళ్ల నాన్నగారికి నచ్చలేదు. కానీ దేవ్ ఖాతరు చేయలేదు. దేవ్, మోనాలకు యిద్దరు పిల్లలు. సునీల్ అనే కొడుకు, దేవినా అనే కూతురు. మోనా నటిగా చాలా మంది పాఠకులకు తెలిసి ఉండకపోవచ్చు, సినిమా ఫంక్షన్లకు ఎప్పుడూ రాలేదు కాబట్టి ఎలా ఉంటుందో ఊహకు అందక పోవచ్చు. ఆమె యిప్పటికీ జీవించి ఉంది. దేవ్ శతజయంతి సందర్భంగా కూడా ఆమె పబ్లిక్‌లోకి రాలేదు. ఆమె రూపురేఖలు తెలియడానికి ఆఖరి సినిమా ‘‘నౌ దో గ్యారహ్’’ సినిమాలోని ‘ఆంఖోంమేఁ క్యా జీ..’ పాట లింకు యిక్కడ యిస్తున్నాను. https://www.youtube.com/watch?v=f5DG-I71hB8
‘‘లండన్‌లోని ఫాయిల్స్ బుక్‌స్టోర్స్‌లో దొరకని పుస్తకం ఉండదు. అక్కడకు వెళ్లి ‘‘గైడ్’’ పుస్తకం సంపాదించి చదివి ఎలా ఉందో చూడు. ఏ మాత్రం బాగున్నా ఆథర్‌కు చెప్పి సినిమాటిక్ ఛేంజెస్ చేద్దాం. పెర్ల్ బక్ కూడా చేతులు కలుపుతానంటోందిగా, పెద్ద స్థాయిలోనే, కలర్‌లో తీద్దాం. ఈ ‘‘హమ్ దోనోఁ’’యే మన నవకేతన్ బ్యానర్‌లో ఆఖరి బ్లాక్ అండ్ వైట్ సినిమా కావాలి.’’ అంది మోనా. కానీ ఆ స్టోర్స్‌లో బుక్ దొరకలేదు. కానీ సేల్స్ గర్ల్ ‘మీ అడ్రసివ్వండి, సంపాదించి పంపుతాను’ అంది. అన్నట్లుగానే మర్నాడు దేవ్ బస చేసిన లండన్ డెర్రీ హోటల్‌కి పంపింది. పుస్తకం చేతికి రాగానే దేవ్ తన రూము బాల్కనీలో కూర్చుని పుస్తకాన్ని ఏకబిగిన చదివేశాడు. విపరీతంగా నచ్చేసింది.
దేవ్ మంచి చదువరి. లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీషులో ఆనర్స్‌తో బిఏ చదివాడు. వాళ్ల నాన్నగారు గురుదాస్‌పూర్‌లో ప్రాక్టీసున్న లాయరు. దేవ్ ఆయనకు మూడో కొడుకు. అవిభక్త భారతదేశంలోనే మంచి కాలేజీల్లో ఒకదానిగా లాహోర్ కాలేజీకి పేరుంది. బిఏ తర్వాత చాలామంది ఎమ్మే చేసి, అక్కణ్నుంచే ఇంగ్లండ్ వెళ్లి చదువుకునే వారు. అందుకని 120 కిమీల దూరంలో ఉన్న లాహోర్‌కు కొడుకుని పంపించి హాస్టల్లో పెట్టి చదివించారు. బిఏ పూర్తయ్యాక దేవ్ ఎమ్మే చేద్దామని ఆశపడ్డాడు. అయితే సరిగ్గా ఆ సమయానికి దేవ్ తండ్రి ప్రాక్టీసు సన్నగిల్లింది. పై చదువులకు డబ్బు లేదు, ఏదైనా ఉద్యోగంలో చేరు అన్నారు. బ్రిటిష్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వారి రాయల్ ఇండియన్ నేవీలో కమిషన్‌లో చేరాలని దేవ్ ప్రయత్నించాడు కానీ సెలక్టవలేదు. బ్యాంకులో క్లర్కుగా చేరు అన్నారు తండ్రి. దేవ్‌కు పట్టరాని దుఃఖం వచ్చింది. తండ్రిపై కంటె పరిస్థితులపై కోపం వచ్చింది.
మామూలు పరిస్థితుల్లో అయితే తండ్రి పైచదువులకు అభ్యంతర పెట్టేవాడు కాదు. ఆయనకు తొమ్మిదిమంది పిల్లలు. అందర్నీ బాగా చదివించాడు. పెద్ద కొడుకు మోహన్ సంస్కృతంలో ఎమ్మే చేసిన తర్వాత లా చదువుతానంటే సరేనన్నాడు. తర్వాత అతను గురుదాస్‌పూర్‌లోనే లాయరుగా ప్రాక్టీసు చేస్తూనే జిల్లా కాంగ్రెసు పార్టీ సెక్రటరీగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైల్లో ఉన్నాడు. రెండో కొడుకు చేతన్ ఐసిఎస్‌కు ప్రిపేరవుతానంటే ఏకంగా ఇంగ్లండు పంపించి అక్కడి యూనివర్శిటీలో చదివించాడు. ఐసిఎస్‌కు సెలక్టు కాకపోవడంతో ఆయన టీచింగులోకి దిగాడు. వీళ్లిద్దరికంటె పెద్దవాళ్లు యిద్దరు కూతుళ్లుంటే పెళ్లిళ్లు చేశారు. పెద్దావిడ దిల్లీలో ఉంది. రెండో ఆవిడ లాహోర్‌లో ఉంది. భర్త డాక్టరు. దేవ్ చెల్లెళ్లు లాహోర్‌లో స్కూల్లో చదువుతున్నారు. తమ్ముడు యింకా స్కూల్లోనే ఉన్నాడు.
ఈ సమయంలోనే ఆయన ప్రాక్టీసు తగ్గిపోయింది. ఇక చదివించ లేనన్నాడు. దేవ్ తండ్రిపై తిరుగుబాటు చేశాడు. ఆయనతో చెప్పాపెట్టకుండా తన దగ్గరున్న 30 రూపాయలను చేతపట్టుకుని, ఓ చేతి సంచీలో తన వస్తువులు సర్దుకుని 1943లో తన 20వ ఏట, బొంబాయికి వెళ్లే ఫ్రాంటియర్ మెయిల్ రైల్లో మూడో తరగతి కంపార్టుమెంటు ఎక్కేశాడు. బొంబాయి ఎందుకంటే అన్నగారు చేతన్ అప్పటికి అక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి! కానీ దేవ్ వచ్చిన కొద్ది రోజులకే ఆయన దెహ్రాదూన్‌లోని తన ఉద్యోగానికి తిరిగి వెళ్లిపోయాడు. దేవ్ అక్కడా యిక్కడా ఉంటూ సినిమా ఛాన్సుల కోసం తిరగసాగాడు. చేతిలో డబ్బు అయిపోవడంతో యిష్టం లేకపోయినా ఒక ఎకౌంటెన్సీ కంపెనీలో గుమాస్తాగా చేరాడు. జీతం 85 రూ.లు. ఆ ఉద్యోగం ఎక్కువకాలం సాగలేదు.
రెండవ ప్రపంచయుద్ధం నడుస్తోంది కాబట్టి ఆర్మీ వాళ్లు తమ మిలటరీ సెన్సార్‌షిప్ డిపార్టుమెంటులో సైనికుల ఉత్తరాలు చదివే ఉద్యోగి కోసం ప్రకటన యిచ్చారు. ఇంగ్లీషు భాషపై మంచి పట్టు ఉండాలన్నారు. దేవ్ యింటర్వ్యూకి వెళ్లి ఆర్మీ మేజరు ముందు నిలబడి, లాహోర్ కాలేజీలో ఇంగ్లీషులో ఆనర్స్ చేశాననగానే ఠక్కున ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం ఆర్థిక భద్రత యిచ్చింది కానీ సినిమా వేషాల గురించి తిరిగేందుకు సమయం చాలకుండా పోయింది. దాంతో 1945లో యుద్ధం ముగిసే వరకు చేసి ఆ ఉద్యోగం మానేసి, వేషాల వేటలో పడ్డాడు. అంతలో ముసురేకర్ అనే మిత్రుడు ట్రైన్‌లో తారసిల్లాడు. అతను సినీసంగీత రంగంలో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నాడు.
అప్పట్లో ప్రఖ్యాత సినిమా కంపెనీ ప్రభాత్ పూనాలో స్టూడియో నడుపుతూ సినిమాలు తీస్తూ ఉండేది. వాళ్లు ‘‘హమ్ ఏక్ హైఁ’’ అనే సినిమాను ప్రారంభించారు. అయితే హీరో పాత్రధారి అమర్యాదగా ప్రవర్తించడంతో అతన్ని తీసేసి, అతని స్థానంలో అర్జంటుగా తేవడానికి మరొక అందమైన యువకుడి కోసం చూస్తున్నారు. స్టూడియో యజమాని బాబూరావు పై ఆఫీసు బొంబాయిలోనే ఉంది. ముసురేకర్ యీ విషయాలన్నీ దేవ్‌కి చెప్పి, మర్నాడే వెళ్లి ఆయన్ను కలవమన్నాడు. దేవ్ మర్నాడు పొద్దున్నే ఆయన ఆఫీసుకి వెళ్లి కూర్చున్నాడు. బాబూరావు కాస్సేపటికి వచ్చి, తన గదిలోకి వెళ్లబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి యితన్ని చూశాడు. అతని దర్జా, హుందాతనం ఆకట్టుకున్నాయిలా ఉంది. లోపలకి పిలిచి మాట్లాడాడు. నీ పేరేమిటి? అని అడిగితే ‘‘దేవ్ ఆనంద్’’ అని చెప్పాడు.
‘‘అదేమిటి? ఇంటి పేరు లేదా?’’
‘‘ఆనంద్ యింటి పేరు. నా పూర్తి పేరు ధరమ్ దేవ్. ధరమ్ అంటే మతం అని అర్థం కదా. మతం మన దేశంలో ఎన్ని కల్లోలాలకు కారణమౌతోందో చూశాక, అది తీసేశాను. నేను మతానికి వ్యతిరేకిని కాను. అది హృదయాల్లో ఉండాలి కానీ గుళ్లలో, మసీదుల్లో ఉండనక్కరలేదని నా భావన.’’
ఆయన నవ్వాడు. ‘‘నీ పెర్శనాలిటీ, నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చాయి. నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. కానీ నీ వేషం సంగతి తేల్చవలసినది డైరక్టరు పిఎల్ సంతోషి. రేపు వస్తే ఆయన్ను కలవవచ్చు.’’ అన్నాడు. మర్నాడు డైరక్టరుకి కూడా దేవ్ నచ్చాడు. ‘‘పూనాలో ఆడిషన్. నువ్వు వెంటనే వెళ్లాలి. డెక్కన్ క్వీన్ రైల్లో ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు పంపిస్తాం. అది సరే కానీ, నీ ఇంగ్లీషు యింత చక్కగా ఉంది. ఎక్కడ నేర్చుకున్నావ్?’’ అని అడిగాడు.
‘‘ఇన్ ద బెస్ట్ కాలేజ్ దిస్ సైడ్ ఆఫ్ ద సూయజ్, సర్..’’ అని దేవ్ స్టయిల్‌గా చెప్పి, వాళ్లిద్దరి చిరునవ్వు చూశాక, ‘‘లాహోర్ గవర్నమెంట్ కాలేజ్’’ అని వాక్యాన్ని పూరించాడు.
ఇలా ఇంగ్లీషు భాషాప్రావీణ్యం దేవ్‌కు అడుగడుగునా ఉపయోగపడింది. అందుకే ఆనాటి అగ్రశ్రేణి నటులెవరికీ రాని అవకాశం, ఇంగ్లీషు సినిమాలో నటించే ఆఫర్, అతనికి వచ్చింది.
‘‘గైడ్’’ నవల చదవడం పూర్తి కాగానే దేవ్ పెర్ల్‌కు ఫోన్ చేసి ‘‘మనిద్దరం కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఆర్ కె నారాయణ్ నవల ‘‘గైడ్’’ నవల గురించి విన్నారా?’’ అని అడిగాడు.
‘‘చదివాను కూడా. ఇక్కడ బ్రాడ్‌వే ప్రాంతంలో చిన్న థియేటర్లలో దాన్ని నాటకంగా కూడా ప్రదర్శిస్తున్నారు. నేను యిన్విటేషన్ పంపిస్తాను. లండన్ నుంచి సరాసరి మాన్‌హట్టన్‌కు వచ్చేయి.’’ అందావిడ. ఆ విధంగా దేవ్ తొలిసారి అమెరికాకు ప్రయాణమయ్యాడు. (ఫోటో – ‘‘బాజీ’’ సినిమాలో దేవ్, గీతా బాలితో, కల్పానా కార్తిక్‌తో) (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)