ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రాజకీయ చాణక్యుడిని ఎందుకు ముద్దుగా పిలుస్తారో, తాజాగా ఆయన ఇస్తున్న లీకులే చెబుతాయి. ఎన్నికలకు ముందు అలివికాని హామీలిచ్చారని ఇంటా, బయటా అందరూ అన్నారు. ఇన్ని హామీలు అమలు చేయడానికి రాష్ట్ర ఖజానా సహకరిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సంపద సృష్టిస్తాననే దబాయింపుతో తనను ప్రశ్నించేవాళ్ల నోళ్లు మూయించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
ఎలాగైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలు ఎప్పుడని వాటి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లేలా టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనకు అధికారం కట్టబెట్టిన ప్రజానీకం మనసెరిగి, సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టాల్సిన చంద్రబాబునాయుడు సరికొత్త ఎత్తుగడ వేశారు.
ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని నడపడం భారంగా వుందని, కావున రాష్ట్ర రథసారథి ఇబ్బందుల్ని అర్థం చేసుకునేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తన పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రజానీకాన్ని షాక్కు గురి చేసే అంశంగా చెప్పొచ్చు.
టీడీపీ అనుకూల పత్రికలో కథనం వచ్చిందంటే, దాని వెనుక ఉద్దేశాలేంటో రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. బాబును ఆరాధించే పత్రికలో ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎంపీలతో ఆయన అన్న మాటలు ఏంటంటే…
‘ఆర్థికంగా తీవ్రమైన క్లిష్ట పరిస్థితులు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ ఎంత కష్టపడుతున్నామో ప్రజలకు తెలియాలి. రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసా కూడా నిధులు లేవు. వైసీపీ దిగిపోతూ ప్రభుత్వాన్ని దివాలా తీయించింది. కొత్త ప్రభుత్వం రాగానే కొన్ని సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు ఆత్రుత పడతారు. మనం ఎన్ని సమస్యల్లో కూరుకుపోయి ఉన్నామో వారికి తెలిస్తే మన కష్టం విలువ తెలుస్తుంది. అవసరం అయిన చోట మనం ఉన్న పరిస్థితిని ప్రజలకు వివరించండి. దానిని మార్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నామో కూడా చెప్పండి’
ఎక్కడైనా పాలకులు ప్రజల కష్టనష్టాలు వినడం చూశాం. వాటి పరిష్కారానికి తామున్నామని భరోసా ఇచ్చే ముఖ్యమంత్రుల గురించి కథలుకథలుగా విన్నాం. కానీ చంద్రబాబు తీరు అందుకు భిన్నంగా వుండడం ఆశ్చర్యం వేస్తోంది. బాబు ఇబ్బందుల్ని ప్రజలకు తన ఎంపీల ద్వారా వివరిస్తారట. ఆయన ఆర్థిక ఇబ్బందుల్ని అర్థం చేసుకుని, తమ సమస్యలను పరిష్కరించాలని అడగకుండా నోళ్లు మూయించే పన్నాగానికి తెరలేపారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు ఆత్రుత పడతారనే కామెంట్ వెనుక లోతైన అర్థం దాగి వుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల్ని వివరించడం ద్వారా, సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఒత్తిడి చేయరనేది బాబు ఉపాయం.
అయితే ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులతో తమకు పనేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమకు హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయాలని మాత్రమే ప్రజలు అడుగారు. తప్పించుకోవాలని చూస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.