ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ, టీడీపీ అగ్రనేతలు విదేశీ పర్యటనలకు వెళ్లారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై ఎలాంటి గోప్యత లేదు. ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఆయన పర్యటనకు సంబంధించి ఫొటోలు ఎప్పటికప్పుడు బయటికొస్తున్నాయి. ఇప్పుడు చర్చల్లా చంద్రబాబు కుటుంబ పర్యటనపైనే.
చంద్రబాబునాయుడు కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశీ పర్యటనకు బయల్దేరడం మొదలు అంతా గోప్యతే. దీంతో బాబు కుటుంబ పర్యటనపై రకరకాల ప్రచారానికి తెరలేచింది. ఈ కోణంలోనే ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా అనుమానాలు తలెత్తాయి. అందుకే ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియనివ్వడం లేదనే చర్చకు తెరలేచింది.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రచారం కోరుకోని నాయకులైతే పెద్దగా పట్టించుకునే వారు కాదు. వారికి విపరీతమైన ప్రచార పిచ్చి వుందని అందరూ అనుకునే మాట. ఇప్పుడు విదేశీ పర్యటనకు సంబంధించి మాత్రం రహస్యంగా ఉంచడం వల్లే రచ్చకు దారి తీసింది. బాబుకు సంబంధించి బయటికి చెప్పకూడనిది ఏదో ఉన్నట్టుగా వుందని చివరికి సొంత పార్టీ వాళ్లు కూడా అనుకునే పరిస్థితి.
మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి ఎల్లో మీడియా నానా రచ్చ చేయడంతో బాబు పర్యటనపై సహజంగానే ప్రత్యర్థులు దృష్టి సారించారు. తమ నాయకుడి పర్యటన తెరిచిన పుస్తకమని, మరి మీ నాయకుడి విదేశీ పర్యటనపై రహస్యం ఎందుకని టీడీపీని వైసీపీ నిలదీస్తోంది.