అనైతికతకు చక్కటి ముద్దు పేరు…ప్రజాస్వామ్య పరిరక్షణ. వైసీపీని అధికారం నుంచి దించడానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇంటికి సాగనంపడానికి తామిద్దరం కలిసి పోటీ చేస్తామనే దమ్ము, ధైర్యం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లో కొరవడ్డాయి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా కలిసి పోటీ చేయొచ్చు. అది వారి ఇష్టం. ఇందులో కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. అదేంటోగానీ, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రకటన బహిరంగంగా చేయడానికి ఆ పార్టీల అధినేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్లి పవన్‌కల్యాణ్ కలిశారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో బాధితుడైన టీడీపీ అధినేతకు జనసేనాని పవన్ సంఘీభావం తెలిపారు. ఇద్దరూ రెండున్నర గంటలకు పైగా భేటీ అయ్యారు. అనంతరం ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇద్దరి మాటల సారాంశం ఏంటంటే… ప్రజాస్వామ్య పరిరక్షణ. అదేంటో గానీ తాను అధికారంలో వుంటే తప్ప ప్రజాస్వామ్యం లేనట్టుగా బాబుతో పాటు పవన్ మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది.
2019లో కూడా చంద్రబాబు ఏకంగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి అనే నినాదంతో మోదీకి వ్యతిరేకంగా దేశమంతా తిరిగారు. మోదీని గుజరాత్‌కు సాగనంపితే తప్ప, భారత్‌కు మోక్షం లేదని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఇదే మోదీ ప్రాపకం కోసం మ్యావ్ మ్యావ్ అంటూ తిరుగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షకుడి గురించి మనమందరం తెలుసుకోవాలి.
బాబు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి చెప్పాలంటే చాలా ఉదాహరణలే ఉన్నాయి. పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా సీఎం కుర్చీ నుంచి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన ఘనత చంద్రబాబుదే. బషీర్‌బాగ్ కాల్పుల్లో అమాయక వామపక్ష కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న పరిపాలన చంద్రబాబుదే. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని, వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చిన రాజనీతజ్ఞుడు చంద్రబాబే.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు తన పార్టీ నాయకుల్ని ఉసిగొల్పి, వారు పట్టుబడడంతో రాత్రికి రాత్రే తట్టాబుట్టా సర్దుకుని ఏపీకి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తరలి వచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబునాయుడే. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది… ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని మాట్లాడి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం శ్రమించిన గొప్ప ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రకెక్కారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు బలిగొన్నది కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకే.
ఇటీవల వరుసగా కందుకూరు, గుంటూరులో 11 మంది అమాయకుల ప్రాణాలను గాలిలో కలిసిపోయేలా చేసింది కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమే. ఇలా ఒకటారెండా… చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం చేసిన పనులు చెప్పాలంటే ఎన్నెన్నో. అలాంటి విజనరీ నాయకుడికి వెన్నుదన్నుగా నిలబడడానికి వెన్నెముక లేని నాయకుడు సంఘీభావం తెలపకుండా ఎలా వుండగలరు. చంద్రబాబు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి…జగన్‌ను ఇంటికి సాగనంపాలి.