ఏం సెప్తిరి..ఏం సెప్తిరి

కొంతమంది చెప్పే సుద్దులు భలే చిత్రంగా వుంటాయి. అందరూ వెజిటేరియన్సే..గంపెడు రొయ్యలు ఏమయ్యాయి అన్న చందంగా వుంటాయి. సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే మంచి కాలమిస్ట్. వారం వారం తన రచనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శిసారు.…

కొంతమంది చెప్పే సుద్దులు భలే చిత్రంగా వుంటాయి. అందరూ వెజిటేరియన్సే..గంపెడు రొయ్యలు ఏమయ్యాయి అన్న చందంగా వుంటాయి. సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే మంచి కాలమిస్ట్. వారం వారం తన రచనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శిసారు. అందులో సందేహం లేదు. కానీ ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లు అనిపిస్తుంటాయి ఒక్కోసారి. ఈవారం వండి వార్చిన పలుకులు ఎలా వున్నాయో చూద్దాం.

‘’..నిజానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు, అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి సంబంధం ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లలో ఎవరు ముఖ్యమంత్రి అయితే మాత్రం వారికి ఏం సంబంధం? అమెరికాలో వారి జీవితాలలో ఎలాంటి మార్పూ ఉండదు కదా? అయినా బతుకుదెరువు కోసం వెళ్లిన వారికి కులాలు, రాజకీయాలు ఎందుకు? విమానం ఎక్కే ముందే కులాన్ని వదిలిపెట్టి భారతీయులుగా మారిపోయేవారు మళ్లీ విదేశీ గడ్డపై కాలు మోపాక కులం తగిలించుకోవడం ఎందుకు? తమను తాము ఎన్‌ఆర్‌ఐలుగా చెప్పుకొనే ఈ ప్రబుద్ధులు కులాల రొచ్చులో కూరుకుపోతుండటం మహా విషాదం!…’’

ఎంత చిత్రం..ఎంత చిత్రం..చెప్పడం వరకు బాగానే వుంది. కానీ అసలు అమెరికాలో వుంటూ ఆంధ్ర నాట రాజకీయాలు చేయడం ప్రారంభించినది ఎవరు? అమెరికాకు చంద్రబాబునో, లోకేష్ నో తీసుకెళ్లి హడావుడి చేయడం మొదలుపెట్టిన తరువాత కదా జగన్ వంతు వచ్చింది. అసలు అమెరికాలో సంఘం పెట్టడం, ఆంధ్రలో సేవా కార్యక్రమాలు అనడం, సన్మానాలు అనడం, ఫలానా సంఘం ఎన్నికైన అధ్యక్షుడు, ఎన్నిక కాబోయే అధ్యక్షుడు, ఇలా రకరకాల పదవులు అడ్డం పెట్టుకుని ఆంధ్రలో పర్యటించడం మొదలుపెట్టింది ఎవరు? సిఎమ్ లను కలిసి మెహర్బానీ చేయడం ప్రారంభించింది ఎవరు? తెలుగు సంఘాలు కుల సంఘాలుగా మార్చడానికి పునాదులు వేసింది ఎవరు? అమెరికా సంఘాలకు తమ కులపోళ్లను తీసుకెళ్లి సన్మానాలు మొదలు పెట్టింది ఎవరు?

ఇప్పుడు కదా అమెరికాలో కౌంటర్ యాక్టివిటీ పెరిగింది. ఒకప్పుడు అంతా తెలుగుదేశం పార్టీ మద్దతు సామాజిక వర్గానిదే కదా హల్ చల్ అంతా. అక్కడి డబ్బులు తో ఇక్కడ పొలిటికల్ యాక్టివిటీ చేయడం అన్నది అప్పుడు ఇప్పుడు సాగిస్తున్నది ఎవరు? నిన్న కాక మొన్న చంద్రబాబు సభలో చీరలు పంపిణీ చేసింది ఎవరు?

ఇప్పుడు అమెరికాలో అన్ని కులాల జనాలు గట్టిగా పెరగడంతో, గడబిడ మొదలయింది. దీంతో ఇది తప్పు అంటూ సుద్దుల చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. సాగినంత కాలం సాగింది. చేసినంత కాలం చేసారు. ఇప్పుడు వాళ్లూ చేస్తున్నారు. అందువల్ల ఇబ్బందులు వస్తాయి కనుక ఇక అస్సలు ఇలాంటివి వద్దు అంటూ సుద్దులు చెబుతున్నారు అనుకోవాలా? తోటకూర నాడే అన్నట్లు అప్పట్లోనే వద్దు అని చెప్పి వుంటే ఇవాళ్టి పరిస్థితి వచ్చేది కాదు కదా. కాదంటారా? ఆర్కే?