ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమీ చెయ్యకుండా అన్నీ తనే చేసినట్టు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని దెప్పి పొడిచారు. చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ దేశంలో మరెవరికీ వుండవని ఆయన వెటకరించారు.
గతంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఏనాడైనా పోర్ట్లు, మెడికల్ కాలేజీలు నిర్మించారా? అని ఆయన నిలదీశారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ ప్రభుత్వంలో జరిగాయన్నారు. కానీ చంద్రబాబు వచ్చి జగన్ ఏమీ చేయలేదని చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. తమ హయాంలో మొదలు పెట్టిన పనులు చంద్రబాబు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాడని తప్పు పట్టారు.
భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన అనుమతులన్నీ వైఎస్ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెట్టారన్నారు. కానీ చంద్రబాబు అన్నీ తానే చేసినట్టు మాట్లాడ్డం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 30 రోజులు అయ్యిందన్నారు. అప్పుడే ప్రజల్ని మోసగించడం మొదలు పెట్టాడని మాజీ మంత్రి విమర్శించారు. ఇందుకు తల్లికి వందనం పథకమే నిదర్శనమన్నారు.
ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి, ఇప్పుడేమో ఒకరికే ఇస్తామన్నట్టుగా జీవో ఇచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.