సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంపై చంద్రబాబు సర్కార్ జాప్యం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు కూడా ఏపీలో హామీ ఇచ్చారన్నారు.
అయితే తెలంగాణలో రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యత తీసుకున్న రెండో రోజే మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారన్నారు. ఏపీలో చంద్రబాబు పాలనకు నెలరోజులని ఆమె గుర్తు చేశారు. మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి అధ్యయనం చేసేందుకు ఏముందో అర్థం కావడం లేదన్నారు. మహిళలందరికీ ఉచిత ప్రయాణం అని చెప్పిన తర్వాత మహిళలంతా వస్తారన్నారు. ఇందులో విధివిధానాలు ఏముంటాయని ఆమె నిలదీశారు.
ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి వుండాలని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధి వుండడం వల్లే మ్యానిఫెస్టోలో పెట్టిన ఉచిత విద్య పథకాన్ని వెంటనే అమలు చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే సూపర్‌సిక్స్‌లో పెట్టిన పథకాలన్నింటినీ వెంటనే అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలుంటే అన్ని రూ.15 వేలు చొప్పున అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారన్నారు. తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ప్రతి తల్లికి ఇస్తున్నట్టు ఉందన్నారు. ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో జగన్ కూడా ప్రతి బిడ్డకూ రూ.15 వేలు ఇస్తానని చెప్పారని, దీనికి సమాధానం చెప్పాలని షర్మిల అన్నారు.