ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ ఆయన జైలు నుంచి బయటికి రాలేని పరిస్థితి. దీనికి కారణం సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ దక్కకపోవడమే. మద్యం పాలసీలో కేజ్రీవాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ ఆయన్ను మార్చి 21న అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్‌ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనల్ని కోర్టు విన్నది. మే 17న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన కేసులో తీర్పు వెలువరించింది.
మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఆప్ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో జైల్లోనే గడపాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ ఇస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. సీఎం పదవి నుంచి దిగిపోవాలా? వద్దా? అన్నది ఆయన ఇష్టమని న్యాయస్థానం తెలిపింది. ఇదే సందర్భంలో సీఎం పిటిషన్‌పై విచారణను విస్తృత ధర్మాసానికి బదిలీ చేసింది.