మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ నిర్మాణం అక్రమం అంటూ ప్రభుత్వం కూల్చేసింది. దీంతో వెంటనే బీసీ కావడం వల్లే తమ ఇంటిని కూల్చేశారని అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుల పల్లవి ఎత్తుకున్నారు.
ఇక చంద్రబాబునాయుడు, లోకేశ్‌ల సంగతి సరేసరి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై చంద్రబాబు, లోకేశ్‌లకు ఉన్నంత ప్రేమాభిమానాలు మరెవరికీ లేవని మాటలు వింటే ఎవరైనా నమ్ముతారు.
చంద్రబాబునాయుడు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ప్రజల తరపున గట్టిగా గళం వినిపిస్తున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు, ఆరెస్ట్‌లు, ఇళ్లపై దాడులతో జగన్ వేధించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
నిజంగా చంద్రబాబుకు బీసీలపై ప్రేమే వుంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన కుమారుడు లోకేశ్ బదులు అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ను ఎందుకు నియమించలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో చింతకాయల విజయ్ చాలా యాక్టీవ్ రోల్ పోషిస్తున్నారు.
సోషల్ మీడియాతో పాటు వివిధ అంశాలపై విజయ్ క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మంచి వక్త కూడా. అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా మంచి యువ బీసీ నాయకుడు. ఇలాంటి వారికి టీడీపీ ఎందుకని తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదనే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఏంటి?
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, అలాగే ప్రధాన కార్యదర్శిగా లోకేశ్… తండ్రితనయులు తప్ప ఆ పదవులకు అర్హులైన నాయకులెవరూ లేరా? అనే నిలదీతలు ఎదురవుతున్నాయి.
బీసీల పేరు చెప్పి అధికారాన్ని తాము అనుభవిస్తూ, వారికి మాత్రం నామమాత్ర పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నలు లేకపోలేదు.
నిజంగా బీసీలపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు అభిమానం వుంటే… వెంటే జాతీయ పదవి నుంచి యువనాయకుడు తప్పుకుని విజయ్ లేదా రామ్మోహన్‌నాయుడికి ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.