నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు రోజులు దగ్గరపడ్డాయి. ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు వుంది. ఏపీలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు రాజకీయం నడుస్తోంది. వీటి మధ్యలో పానకంలో పుడక మాదిరి జనసేన ఉంది. అయితే ఈ రెండు పార్టీలు ఆత్మకూరు బరి నుంచి తప్పుకున్నాయి. ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయ్యింది. వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. లక్ష మెజార్టీ తమ టార్గెట్ అని అధికార పార్టీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫిర్యాదు చేయడం ఆసక్తికర పరిణామం.
వాలంటీర్ల ద్వారా ఓటర్లకు వైసీపీ డబ్బులు పంపిణీ చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. డబ్బు పంపిణీ చేస్తున్న వలంటీర్లను తమ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని, వారిపై దాడికి పాల్పడుతున్నారని వీర్రాజు వాపోయారు. కావున తమ అభ్యర్థి భరత్‌కుమార్‌తో పాటు ఏజెంట్లకు రక్షణ కల్పించాలని ఎస్ఈసీకి విన్నవించినట్టు సోము వీర్రాజు వెల్లడించారు.
తమకు జనసేన మద్దతు ఇస్తుందని, ఎంతోకొంత రాజకీయంగా లాభిస్తుందని బీజేపీ భావించింది. అది జరగకపోవడంతో బీజేపీ నిరాశలో వుంది. అలాగే టీడీపీ నేతలు కూడా బీజేపీకి ఏ మాత్రం మద్దతు ఇవ్వలేదు. దీంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
కడప జిల్లాలో బద్వేలు ఉప ఎన్నికలో కొంత వరకు క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు సహకరించారు. కానీ ఆత్మకూరులో మాత్రం అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. డిపాజిట్ దక్కించుకోవడమే బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్‌గా చెప్పొచ్చు. బీజేపీ టార్గెట్ అదే మరి!