ముందస్తు ఎన్నికలు అనేవి ‘చంద్ర’కుట్ర!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొందరలోనే శాసనసభను రద్దు చేయబోతున్నారని, మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని కొన్ని వారాలుగా రాజకీయ వర్గాలలో తీవ్రమైన ప్రచారం జరుగుతోంది.  Advertisement ఈ నెలలో జరిగే క్యాబినెట్…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొందరలోనే శాసనసభను రద్దు చేయబోతున్నారని, మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని కొన్ని వారాలుగా రాజకీయ వర్గాలలో తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. 

ఈ నెలలో జరిగే క్యాబినెట్ సమావేశంలోనే అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని ఒకవైపు.. ఇప్పుడు నిర్ణయం తీసుకుని అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని మరొకవైపు ఎవరికి తోచిన రీతిగా వారు విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు! అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేయడం అనేది జరగని పని! ఈ విషయాన్ని తాజాగా ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రులలో ఒకరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చిచెప్పారు. 

తమ ప్రభుత్వానికి ప్రజల్లో పూర్తి మద్దతు ఉన్నదని, అయిదేళ్లు పాలించడానికి ప్రజలు అధికారం ఇస్తు, మధ్యలో దిగిపోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన చెప్పారు. పార్లమెంటుతోపాటే అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని కూడా తేల్చారు.

ముందస్తు ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు వస్తాయనే ఇంత ముమ్మర ప్రచారం ఎలా జరుగుతోంది. కాస్త లోతుగా పరిశీలిస్తే ఇదంతా చంద్రబాబునాయుడు కుట్రగా విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడే.. ఇప్పటికే ఏడాది కాలంగా.. ముందస్తు ఎన్నికలు వచ్చేయబోతున్నాయి, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండండి అని పదేపదే ఊదరగొడుతున్నారు. 

ఇటీవలి కాలంలో కూడా ఆయన ముందస్తు ఎన్నికల గురించి వేర్వేరు వేదికల మీద పదేపదే అంటున్నారు. తన పార్టీ నాయకులు ఎక్కడ కట్టుతప్పి పోతారో, ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తారో అనే భయంతో ఆయన ఏడాదిగా ముందస్తు పాట పాడుతూ వచ్చారు. 

ఇప్పుడైతే.. పల్లకీ మోయడానికి కలిసి వస్తానన్న పవన్ కల్యాణ్ పొత్తుల సంగతి తేల్చిచెప్పకుండా మీనమేషాలు లెక్కిస్తున్నందువల్ల, ఆయనలో వేడి పుట్టించడానికి ముందస్తు మంత్రప్రయోగం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ కు ఒక పట్టాన నిర్ణయం చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఇటు బిజెపిని కూడా తీసుకురావాలని ఆయన కోరిక. అలాగే.. ఎన్నిసీట్లు అడగాలి, ఎన్ని సీట్లలో నిజంగా తమ పార్టీ గెలవగల సత్తా ఉంది అనే సంగతి ఆయనకే క్లారిటీ లేదు. 

ఈ కారణంగా పొత్తులను సాగదీస్తున్నారు. ఆయనలా సాగదీస్తూపోయి చివరినిమిషంలో సీట్లకోసం పేచీ పెడితే.. వాటిని కేటాయించడంలో గానీ, అప్పటికప్పుడు అసంతృప్తికి గురయ్యే తమ పార్టీ నేతలను బుజ్జగించుకోవడానికి గానీ సరైన సమయం ఉండదనేది చంద్రబాబు భయం. 

అందుకే వీలైనంత వెంటనే అవన్నీ తేలాలని కోరుకుంటున్నారు. ఆ కుట్రవ్యూహంతోనే.. తన భయాన్ని దాచుకుని, ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ ఒక వ్యూహాత్మక ప్రచారం సాగిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.