యువకుడైన సీఎం జగన్‌తో వృద్ధుడైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పోటీ పడుతున్నారు. వృద్ధాప్యం తన శరీరానికే తప్ప మనసుకు కాదని చంద్రబాబునాయుడి ఉపన్యాసాలు చెబుతున్నాయి. ఎలాగైనా జగన్‌ను గద్దె దింపాలన్న పట్టుదలతో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఇవాళ చంద్రబాబు పొత్తులపై కీలక ప్రకటన చేశారు.
“ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం” అని చంద్రబాబు ప్రకటించారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే…”రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ వుంది. ఈ అరాచక పాలన పోవాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఒక కొండవీటి సింహంలా, బొబ్బిలిపులిగా గాండ్రించాల్సిన అవసరం ఉంది” అన్నారు.
వైఎస్ జగన్‌ను అధికారం నుంచి దింపాలంటే కేవలం టీడీపీ ఒక్కదాని వల్లే సాధ్యం కాదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. అందుకే ఆయన పదేపదే అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. ఇదే రకమైన అభిప్రాయాన్ని జనసేన ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చనని పవన్ కల్యాణ్ స్పష్టం చేయడం ద్వారా టీడీపీతో పొత్తుపై పరోక్షంగా సానుకూల సంకేతాలు పంపారు.
జగన్‌ను గద్దె దించడానికి తన మిత్రపక్షమైన బీజేపీని పవన్‌కల్యాణ్ వ్యూహాత్మకంగా రోడ్‌మ్యాప్ అడిగారు. ఇంత వరకూ బీజేపీ రోడ్‌మ్యాప్ ఇవ్వలేదు. కానీ క్షేత్రస్థాయిలో అవసరమైన చోట టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలో భాగంగా టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి.
జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులకు టికెట్ల దక్కవు. అందుకే త్యాగాలకు సిద్ధమని సొంత పార్టీ నేతలను మానసికంగా చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఏదైనా కారణంతో జనసేనతో పొత్తు లేకపోతే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనే అధికారంలోకి రాదనే సంకేతాల్ని చంద్రబాబు, పవన్ పంపుతున్నారు. ఈ ధోరణి రెండు పార్టీలకు నష్టదాయకమే.
పొత్తులపై త్వరగా ఓ నిర్ణయానికి రావాలన్న ఆత్రుత చంద్రబాబులో కనిపిస్తోంది. జనసేన, బీజేపీ స్పందనపై ఉత్కంఠ నెలకుంది.