ఇప్పటి రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల పరువు తీయాలంటే, ఉతికి ఆరేయాలంటే వారికి టెక్నాలజీ బాగా ఉపయోగపడుతోంది. ఏళ్ళ కిందట ప్రచురితమైన వార్తా పత్రికలు కూడా ఇప్పుడు నెట్ లో సులభంగా లభిస్తున్నాయి.
ఒక్క వార్తా పత్రికలే కాదు పాతకాలంనాటి ఫోటోలు, సినిమాలు, వీడియోలు కూడా నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా అనేవి రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడుతున్నాయి. వీటిని వారు ఉపయోగించుకుంటున్న సమర్ధంగా మరొకరు ఉపయోగించుకోరేమో.
ప్రతి రాజకీయ పార్టీకి ఆధునిక టెక్నాలజీతో కూడిన, సమర్ధవంతమైన సోషల్ మీడియా విభాగాలున్నాయి. వీటిల్లో మెరికల్లాంటివారు పనిచేస్తున్నారు. ప్రత్యర్థులను ఎలా దెబ్బ కొట్టాలో, వారి పరువు ఎలా తీయాలో వారికి బాగా తెలుసు. అలా తెలుసు కాబట్టే వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు కావొచ్చు లేదా పార్టీలో బాగా టెక్నాలజీ తెలిసిన నాయకులో, కార్యకర్తల్లో కావొచ్చు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరువు తీసిపెట్టారు.
ఇరవై ఏడేళ్ల కిందట చంద్రబాబు డెక్కన్ క్రానికల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ను ఫ్లెక్సీలుగా చేసి విజయవాడ రోడ్లపై ఉంచారు. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసిన నేపథ్యంలోనే ఇది జరిగింది అనడంలో సందేహం లేదు.
తమకు ఎన్టీఆర్ అవసరం లేదు అని బాబు ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు. దాన్నే డెక్కన్ క్రానికల్ హెడ్డింగ్ గా పెట్టింది. ఇప్పుడు ఆ పేపర్ ను పెద్దగా చేయించి ప్రదర్శించారు వైసీపీ వాళ్ళు. నిజానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం వెనుక పెద్ద మర్మమే ఉంది. ఎన్టీఆర్ ఖ్యాతిని తగ్గించడమో లేదా తొలగించడమో జగన్ ఉద్దేశ్యం కాదు.
ఇప్పటికే జగన్‌కు ఎన్టీఆర్ అంటే ఎనలేని గౌరవముంది. అయితే టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ ప్రభావాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఇదంతా జరిగింది. పేరును తొలగించడం ద్వారా రాష్ట్రంలో ఈ అంశం చర్చకు వచ్చేలా చేశారు. అదే చర్చ సందర్భంగా ఎన్టీఆర్‌ను నాడు చంద్రబాబు అండ్ కో ఎలా మోసం చేశారు, ఆయనపై ఎన్ని నిందలేశారు, ఎలా దూషించారు, ఆయన విలువల్ని దిగజార్చేందుకు చేసిన ప్రయత్నాలేంటి ఇవన్నీ ప్రజల ముందుంచాలనేదే జగన్ వ్యూహం.
ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. నాడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన వెన్నుపోటు ఎపిసోడ్ మొత్తం మరోసారి ప్రజలకు గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్రాప్‌లో చంద్రబాబు అండ్ కో పడ్డారనేది ఇప్పుడు మరోసారి నిజమైంది. 1995 సంక్షోభం సమయంలో చంద్రబాబు డెక్కన్ క్రానికల్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్యూ క్లిప్పింగులు ఇప్పుడు బయటపడుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అవసరం మాకు లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పిన విషయం హెడ్‌లైన్‌గా ఉంది. ఈ క్లిప్పింగులు ఇప్పుడు విజయవాడ రోడ్లపై వెలిశాయి. వైసీపీ వర్గాలు ఈ క్లిప్పింగులు బహిర్గతం చేశారా మరెవరైనా అనేది తెలియకపోయినా..ఎన్టీఆర్ అవసరం లేదు..ఎవరు ఆయన్ని దూరం పెట్టాలనుకున్నారనేది ప్రజలకు అర్ధమౌతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ వాదిస్తున్నట్టుగానే ఎన్టీఆర్ పేరును, ఖ్యాతిని తొలగించాలనే చంద్రబాబు ఆలోచనకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ పేపర్ క్లిప్పింగ్. దీనికి టీడీపీ వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.