వైసీపీని ఇర‌కాటంలో నెట్టే వ్యూహం

అధికార పార్టీ వైసీపీని ఇర‌కాటంలోకి నెట్టేందుకు చంద్ర‌బాబునాయుడు వ్యూహం ర‌చిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ…

అధికార పార్టీ వైసీపీని ఇర‌కాటంలోకి నెట్టేందుకు చంద్ర‌బాబునాయుడు వ్యూహం ర‌చిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ కూడా విడుద‌లైంది. నామినేష‌న్ల దాఖ‌లుకు ఈ నెల 13 చివ‌రి గ‌డువు.

ఒక్కో ఎమ్మెల్సీకి 22 లేదా 23 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీని న‌లుగురు ఎమ్మెల్యేలు విభేదించిన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విప్ జారీ చేయ‌డంతో పార్టీని ధిక్క‌రించి వెళ్లిన వారిని ఇబ్బందుల్లో నెట్టే ప్ర‌య‌త్నం క‌నిపిస్తోంది. 

ఒక‌వేళ విప్‌ను ధిక్క‌రించి వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓట్లు వేస్తే, అన‌ర్హ‌త వేటుకు గుర‌య్యే అవ‌కాశం వుంటుంది. ఆ ప‌రిస్థితిని తీసుకొచ్చేందుకైనా త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో నిలపాల‌ని చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు పార్టీ ముఖ్యుల‌తో చంద్ర‌బాబు కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తున్నార‌ని తెలిసింది. 

టీడీపీ త‌ర‌పున 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం టీడీపీలో 19 మంది ఎమ్మెల్యేలున్నారు. అలాగే వైసీపీని ధిక్క‌రించిన ఎమ్మెల్యేలు ఇద్ద‌రున్నారు. ఇటు టీడీపీ, అటు వైసీపీ త‌మ ఎమ్మెల్యేల‌కు విప్ జారీ చేయ‌నున్నారు. పార్టీ ఆదేశాల‌ను కాద‌ని ఇత‌రుల‌కు ఓటు వేస్తే ప‌రిణామాలు తీవ్రంగా వుంటాయి. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను అసంతృప్త నేత‌ల‌కు ప‌రీక్ష పెట్ట‌డానికి చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.