బహిష్కృతులతో బాబు ఇచ్చే సంకేతాలేంటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన, అప్పటికే అనేకానేక ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓట్లను రాబట్టుకుని, గెలిచే బలం లేకపోయినా తమ…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన, అప్పటికే అనేకానేక ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓట్లను రాబట్టుకుని, గెలిచే బలం లేకపోయినా తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఆ తర్వాత వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. వారిలో ముగ్గురు ఆల్రెడీ చంద్రబాబు పంచన చేరారు. 

ఇన్నాళ్లూ స్పష్టత ఇవ్వని ఉండవిల్లి శ్రీదేవి కూడా తాజాగా ఆ ఘట్టం ముగిస్తున్నారు. తాజాగా ఆమె చంద్రబాబునాయుడుతో గంటకు పైగా భేటీ కావడం, రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నాలుగున్నర నెలల పాటు ఆలోచించానని, నా నిర్ణయం త్వరలో చెప్తానని అనడం అసలు సంగతిని తెలియజేస్తోంది.

అయితే ఇక్కడ ప్రజలకు ఎదురవుతున్న ప్రధానమైన సందేహం ఏంటంటే.. అధికార పార్టీలో ఉండగా.. అత్యంత అవినీతిపరులుగా, దుర్మార్గులుగా, విలువలు లేని వ్యక్తులుగా ముద్రపడిన బ్యాచ్ వారిని వేరే గతిలేనట్లుగా ఆదరించి, నెత్తిన పెట్టుకుని చంద్రబాబునాయుడు ఏం సాధించదలచుకుంటున్నారు? రాష్ట్రప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వదలచుకుంటున్నారు? అనేదే!

ఇప్పటిదాకా స్పష్టంగా పచ్చ పార్టీ రంగు పులుముకున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. కోటంరెడ్డి బెట్టింగ్ దగ్గరినుంచి అక్రమ దందాలు సాగించడం, పోలీసులతో సహా ప్రభుత్వాధికార్ల మీద చెలరేగిపోవడం అలవాటుగా ప్రజల దృష్టిలో ఏహ్యభావానికి గురైన నాయకుడు. ఆనంను అచేతనమైన నాయకుడిగా వెంకటగిరి ప్రజలు తిరస్కరించారు. మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఇద్దరు భార్యల వ్యవహారం ఆయన నైతిక విలువల రాహిత్యాన్ని బయటపెట్టింది. వీరందరినీ చంద్రబాబునాయుడు అక్కున చేర్చుకున్నారు. వీరందరూ ఇంకా పచ్చకండువా వేసుకోకుండా ఆ పార్టీ పనులు చేస్తూ గడుపుతున్నారు.

ఇప్పుడు ఉండవిల్లి శ్రీదేవి వంతు వచ్చింది. ఆమె రాజధాని ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటూ అవినీతికి, అక్రమదందాలకు కేరాఫ్ అడ్రస్ గా అపకీర్తి గడించారు. పేకాట క్లబ్ ల నిర్వహణ స్వయంగా చేపడుతున్నట్టుగా ఆధారాల సహా బయటకు వచ్చాయి. పోలీసు అధికారుల్ని బండబూతులు తిట్టడం, ఇసుక అక్రమ దందాలు ఆమె కీలక వ్యాపకాలుగా బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడామె తెలుగుదేశం పాట పాడుతున్నారు.

ఇంతగా భ్రష్టు పట్టిపోయిన ఒక నాయకురాలిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని చంద్రబాబునాయుడు ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వదలచుకున్నారు. మా పార్టీలో చేరితే చాలు.. మీరు ఎంతటి అవినీతిపరులైనా, అక్రమార్కులైనా.. మేం మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం అని చెప్పదలచుకున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.