టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఎటూ మాట్లాడుతుంది. కానీ బీజేపీ నుంచి నేతలు గొంతు సవరించుకోవడమే విశేషంగా చెప్పుకోవాలి. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేకనే జగన్ అక్రమ అరెస్టులు చేయించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అంటున్నారు. ప్రజల వద్దకు బాబును వెళ్లనీయకుండా అడ్డుకునే యత్నంలో భాగమే ఈ అరెస్ట్ అని విష్ణు కుమార్ రాజు అంటున్నారు. చంద్రబాబుకు ప్రజాదరణ పెరిగిపోయిందని అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 150 కి పైగా సీట్లు వస్తాయని వైసీపీకి పాతిక కంటే ఎక్కువ సీట్లు రావని విష్ణు కుమార్ రాజు జోస్యం వదిలారు. ఆయన బీజేపీలో ఉన్నా ఎపుడూ టీడీపీకి మద్దతుగానే మాట్లాడుతారు అని విమర్శలు ఉన్నాయి.
మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అయితే జగన్ కి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తనదైన విశాఖ ఆక్టోపస్ జోస్యం చెప్పేశారు. వైసీపీ అందుకే అరెస్టుల పర్వానికి తెర తీసింది అన్నారు. తనను అరెస్ట్ చేయడం అంటే భయంతోనే అని చెప్పుకున్నారు ఇలా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు జోస్యాలు చెబుతూ వైసీపీని శాపనార్ధాలు పెట్టేశారు.
అరెస్టులతోనే ఓట్లు రాలితే సింపతీ పెరిగితే మంత్రాలకు చింతకాయలు రాలినట్లే అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు విషయంలో ఆధారాలు ఉండబట్టే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అంటున్నారు. ఆ విషయం గ్రహించకుండా కక్ష సాధింపు అంటూ మాట్లాడమేంటి అని ఆమె మండిపడ్డారు.