మాజీ ముఖ్యమంత్రి చంద్రనాయుడి అరెస్ట్ ఆయనతో పాటు చాలా మందికి షాక్ ఇచ్చింది. ఇది అసలు ఊహించని పరిణామం. ఏం పీకుతారో పీక్కోండని చంద్రబాబు ప్రతిరోజూ జగన్ ప్రభుత్వాన్ని సవాల్ చేయడాన్ని చూశాం. చంద్రబాబు చాలా తెలివైన నాయకుడని, అవినీతికి పాల్పడినా ఆధారాలు దొరక్కుండా చేసుకుని వుంటారని ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం కూడా నమ్మేది. అయితే రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంలో ఐటీశాఖ నోటీసులు, తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో ఆయన పల్లకీ మోసే వాళ్లంతా జీర్ణించుకోలేకపోతున్నారు.
బాబు అరెస్ట్‌తో షాక్‌కు గురైన వారిలో “ఈనాడు” సారథి రామోజీరావు కూడా ఉన్నారు. బాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామోజీ అరెస్ట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాల కేసులో ఏపీ సీఐడీ పలుమార్లు రామోజీరావు, ఆయన కోడలు శైలజాకిరణ్‌లను విచారించింది. చంద్రబాబునే అరెస్ట్ చేస్తే, ఇక తానెంత అనే భావన రామోజీరావుని భయపెడుతోందనేందుకు ఈనాడులో ఇవాళ “జగన్ పైశాచికానందం” శీర్షికతో ఈనాడులో రాసిన బ్యానర్ ఎడిటోరియలే నిదర్శనం.
జగన్ పాలనను తాలిబన్ల అరాచకంతో పోలుస్తూ ఎడిటోరియల్‌ను మొదలు పెట్టడాన్ని చూస్తే రామోజీరావు అక్కసును పసిగట్టొచ్చు. చంద్రబాబు అరెస్ట్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు తనను విచారిస్తున్న ఏపీ సీఐడీపై మరోసారి విషం చిమ్మారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ చెప్పగా, ఆయన తన యజమాని మాటలకు వంత పాడాడని రామోజీ పత్రిక రాసుకొచ్చింది. ఈ రాతల్లోని ప్రతి అక్షరం తన రాజకీయ యజమాని చంద్రబాబు మాటలకు వంత పాడడం కాదా? అని ప్రశ్నించే వాళ్లకు రామోజీరావు సమాధానం ఏంటి?
గురవింద గింజ తనలోని నలుపును ఎరగదన్నట్టు నంగనాచి కబుర్లెన్నో చెప్పే జగన్ 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 38 కేసుల్లో నిందితుడని రామోజీ పత్రిక గుర్తు చేసింది. చంద్రబాబుపై కేసులు నమోదైతే మాత్రం అక్రమం, ఇదే జగన్‌పై మాత్రం సక్రమమని నిస్సిగ్గుగా రామోజీ పత్రిక రాసుకొచ్చింది. జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేసి, వాటిని పెట్టుకుని ఇంతకాలం వేలెత్తి చూపుతూ చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ , పవన్‌కల్యాణ్ తదితర ఎల్లో బ్యాచ్ పైశాచికానందాన్ని పొందడం లేదా?
మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థను అడ్డం పెట్టుకుని నిధులను పక్కదారి మళ్లించి తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడిన రామోజీరావుకు గురవింద గింజ సామెత వర్తించదా? తన కింద నలుపు పెట్టుకుని, తనకు గిట్టని నాయకులను వేటాడుతూ, చంద్రబాబు పల్లకీ మోస్తూ జర్నలిజం నైతిక విలువలకు పాతరేస్తూ నిత్యం అక్షర హననానికి పాల్పడడం లోకానికి తెలియదని రామోజీ భ్రమల్లో ఉన్నట్టుంది.
బహుశా రామోజీరావు తన అరెస్ట్‌ను కూడా ఊహించి, చంద్రబాబు అరెస్ట్‌ను అడ్డు పెట్టుకుని పైశాచికానందం అంటూ ఎడిటోరియల్ రాశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో… బెడ్‌పై పడుకుని “ఇది కాల మహిమో, జగన్ మహిమో” అని తీవ్ర నిరాశతో రామోజీరావు అన్న కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమనెవరూ ఏమీ చేయలేరని విరవీగే చంద్రబాబు, రామోజీరావు లాంటి అహంకారుల పాపం పండే రోజులొచ్చాయనే చర్చకు తెరలేచింది.