ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా గుండె పోటుతో మృతి చెందారా…వెంటనే అక్కడ ఎల్లో మీడియా ప్రతినిధులు, టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్‌తో తీవ్ర మనస్తాపానికి లోనై గుండెపోటుతో మృతి చెందినట్టు చిత్రీకరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర మరణాలను చంద్రబాబు ఖాతాలో వేయడానికి వీలు కాకపోవడంతో, వాళ్లంతా చచ్చి బతికిపోయారనే సరదా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అవినీతి కేసులో శనివారం ఉదయం ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. బాబు అరెస్ట్ వార్తను టీవీలో చూసి, లేదా ఎవరైనా చెబితే వినో రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టు ఎల్లో మీడియాలో రాయడం గమనార్హం.
ఎల్లో మీడియా రాతల ప్రకారం…. చంద్రబాబు అరెస్ట్ వార్తను టీవీలో చూసి కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు కొడాలి సుధాకర్‌రావు గుండెపోటుతో మృతి చెందాడట. అలాగే గుంటూరు రూరల్ పరిధిలోని బుడంపాడు బీసీ నాయకుడు శివయ్య యాదవ్, అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మపురం గ్రామ వార్డు సభ్యుడు ఆంజనేయులు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని రామస్వామితోటలో సుగుణమ్మ, ఇదే జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామ నివాసి నరసింహారావు, విజయనగరం జిల్లాలో రోతు పైడితల్లి ,తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం ఎస్సీ కాలనీకి చెందిన వెంకటరమణ గుండెపోటుతోనే మృతి చెందడం గమనార్హం.
అయితే చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో మాత్రం చంద్రబాబు అరెస్ట్ ఏ ఒక్కరికీ గుండె పోటు తెప్పించలేకపోయింది. వాళ్లంతా హాయిగా బతుకుల్ని సాగిస్తున్నట్టు అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్‌తో ఆయన సామాజిక వర్గానికి గుండె పోటు తెప్పించలేకపోయింది. బాబు అరెస్ట్‌తో వారెవరూ కలత చెందడమో, మనస్తాపానికి లోనుకావడమో జరగలేదని ఎల్లో మీడియా రాతల ద్వారా తెలుస్తోంది. ఇదిలా వుండగా గుండె పోటుతో చంపితే చంపారు గానీ, కనీసం వాళ్లకు టీడీపీ ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత వుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.