మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. చంద్రబాబు సచ్ఛీలుడని సామాన్య జనం అనుకోవడం లేదు. అయితే చంద్రబాబు నక్కజిత్తుల నాయకుడని, రెండెకరాల ఆసామి వేల కోట్లకు అధిపతి అయ్యాడంటే, చేతికి అవినీతి మరక అంటకుండా ఎంత బాగా వ్యవస్థల్ని మేనేజ్ చేశాడో అని ఇంత కాలం జనం అనుకునేవాళ్లు. అంతే తప్ప, చంద్రబాబు నిజాయతీపరుడని ఒక్కరంటే ఒక్కరు కూడా విశ్వసించడం లేదు.
కేవలం మీడియాను అడ్డు పెట్టుకుని తానొక నిప్పునని, ప్రత్యర్థులంతా అవినీతిపరులు, దోపిడీదారులని చంద్రబాబు ముద్ర వేయగలిగారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద ఆయన పప్పులేవీ ఉడకలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసి, ఈయన సామాన్యుడు కాదు అని అనిపించుకున్నారు. తన తండ్రి వైఎస్సార్ చేయలేని పనిని జగన్ చేసి చూపించారనే విస్తృతమైన చర్చ జన సామాన్యుల మధ్య సాగుతోంది.
చంద్రబాబు చాణక్యం జగన్ ముందు సాగలేదు. ఎట్టకేలకు చంద్రబాబు అవినీతిపరుడని చట్టబద్ధంగా జగన్ స్టాంప్ వేయగలిగారు. ఈ కేసులన్నీ న్యాయస్థానాల్లో నిలుస్తాయా? లేదా? అన్నది తర్వాత విషయం. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌ను వెనకేసుకొస్తున్న వివిధ పక్షాల నాయకుల తీరుపై జనం పెదవి విరుస్తున్నారు. బాబును వెనకేసుకొస్తున్న వాళ్లంతా కులపిచ్చి వున్నోళ్లే అనే చర్చకు తెరలేచింది.
బాబు అరెస్ట్ తర్వాత సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు కామెంట్స్‌ను ఎల్లో మీడియా ప్రధానంగా ప్రసారం చేయడాన్ని గమనించొచ్చు. రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టడం చట్ట విరుద్ధం, అక్రమం అని ఆయన చేసిన ట్వీట్‌ను పట్టుకుని …తమ నాయకుడికి ఏమీ కాదని తెగ సంబరపడడాన్ని గమనించొచ్చు.
ఒకవైపు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పక్కా ఆధారాలను సీఐడీ అధికారులు చూపుతున్నా, అసలు ఆయన్ను అరెస్ట్ ఎలా చేస్తారని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు. ఇలాంటి నాయకులందరి గురించి గ్రామాల్లో రచ్చ బండల వల్ల, అలాగే పట్టణాల్లో టీ స్టాళ్లు, హోటళ్ల దగ్గర జనం చర్చించుకుంటున్నారు.
చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గానికి చెందిన సీబీఐ మాజీ డైరెక్టర్, అలాగే సీపీఐ, బీజేపీ తదితర పార్టీలు, సంస్థల నాయకులు అండగా నిలుస్తున్నారనే తేల్చేస్తున్నారు. కుల నాయకుడనే కారణంతో ఆయన అవినీతిని వెనకేసుకు రావడం ఎంత వరకు సమంజసమని జనం నిలదీస్తున్నారు.