టీడీపీ భ‌య‌మే నిజ‌మ‌వుతోందా.. ఊబిలోకి బాబు!

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో క‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాలంటూ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఏపీ హైకోర్టులో వేసిన పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ…

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో క‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాలంటూ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఏపీ హైకోర్టులో వేసిన పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ‌లో భాగంగా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే… టీడీపీ ఆందోళ‌న నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. రానున్న రోజుల్లో చంద్ర‌బాబు కేసుల ఊబిలో మ‌రింత కూరుకుపోయే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం స్కిల్ స్కామ్‌పై ఏపీ సీఐడీ ద‌ర్యాప్తు జ‌రుపుతోంది. చంద్ర‌బాబునాయుడు అవినీతికి పాల్ప‌డ్డార‌నే సాక్ష్యాధారాల‌తో ఆయ‌న్ను అరెస్ట్ చేసింది. 34 రోజులుగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో బాబు ఉంటున్నారు. ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్ కావ‌డం, ప‌క్క రాష్ట్రాల‌తో లింక్ అయిన నేప‌థ్యంలో విచార‌ణ బాధ్య‌త‌ల్ని సీబీఐకి అప్ప‌గించాల‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే.

హైకోర్టులో ఉండ‌వ‌ల్లి పిటిష‌న్‌పై శుక్ర‌వారం వాద‌న‌లు ముగిశాయి. ఈ సంద‌ర్భంగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును ఈడీ, ఐటీ, సీఐడీ విచారిస్తున్న నేప‌థ్యంలో , సీబీఐకి అప్ప‌గిస్తే స‌మ‌గ్ర వివ‌రాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని ఉండ‌వ‌ల్లి త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. హై ప్రొపైల్ కేసు కావ‌డంతో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం వుంద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. భారీగా నిధులు ప‌క్క‌దారి మ‌ళ్లించిన‌ట్టు సీఐడీ ద‌ర్యాప్తులో తేలింద‌ని, కావున నిష్ప‌క్ష‌పాత ద‌ర్యాప్తు కోసం కేంద్ర విచార‌ణ సంస్థ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు.

ఈ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డంపై త‌మ‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ శ్రీ‌రామ్ కోర్టుకు విన్న‌వించారు. అంతేకాదు, స్కిల్ స్కామ్‌, పైబ‌ర్ నెట్‌, అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసుల‌ను సీబీఐతో విచారించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని తాము ఎప్ప‌టి నుంచో కోరుతున్నామ‌ని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐకి కేసు విచార‌ణ‌ను అప్ప‌గించాల‌న్న అభిప్రాయంలో ప్ర‌భుత్వానికి రెండో మాటే లేద‌ని ఏపీ హైకోర్టుకు ఏజీ తెలిపారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తివాదుల‌కు నోటీసులు ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. అలాగే విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేసును సీబీఐకి అప్ప‌గించాల‌న్న నోటీసుల‌పై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తార‌నే ఆస‌క్తి నెల‌కుంది. ప్ర‌స్తుతం సీఐడీ విచార‌ణ‌తోనే సంతృప్తి చెందుతారా?  లేక రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ‌పై న‌మ్మ‌కం లేద‌ని, సీబీఐకి అప్ప‌గించినా అభ్యంత‌రం లేద‌ని కోర్టుకు బాబు విన్న‌విస్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఒక‌వేళ సీబీఐ విచార‌ణ‌కు హైకోర్టు ఆదేశిస్తే మాత్రం చంద్ర‌బాబు పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన‌ట్టే అని టీడీపీ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.