ప్రమాదకరమైన వాగ్దానం ‘పూర్ టూ రిచ్’

సంక్షేమ పథకాల పేరిట ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేకానేక పథకాలు తీసుకువచ్చారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఊహకు కూడా అందని రీతిలో ఇక్కడ పథకాలు అమలు అవుతున్నాయి.  Advertisement రాష్ట్రంలో ప్రతి…

సంక్షేమ పథకాల పేరిట ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేకానేక పథకాలు తీసుకువచ్చారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఊహకు కూడా అందని రీతిలో ఇక్కడ పథకాలు అమలు అవుతున్నాయి. 

రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం కులమతాలతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నదని అంటే అతిశయోక్తి కాదు. అయితే జగన్ ను ఓడించి అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్న చంద్రబాబునాయుడు.. మరిన్ని రకాల పథకాలను ప్రకటించారు. చూడడానికి ఇవి ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంలోని మహిళకు 18ఏళ్లు దాటితే చాలు.. నెలనెలా 1500 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చేశారు. ఇలాంటి అనేకానేక వరాల మధ్యలో అత్యంత ప్రమాదకరమైన విషనాగు లాంటి వరం ఒకటి పొంచి ఉంది.. అదే ‘పూర్ టూ రిచ్’!

రాష్ట్రంలోని పేదలందరినీ ధనికులుగా మార్చేందుకు ఈ కార్యక్రమం తీసుకువస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ఈ మాట కూడా చాలా వినసొంపుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పేద అనే వర్గమే లేకుండా, ప్రతి ఒక్కరినీ ధనికులుగా చేసే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందిట. ప్రభుత్వ ప్రెవేటు ప్రజల భాగస్వామ్యంతో – పీ4 అనే ట్యాగ్ లైన్ తో దీనిని అమలు చేస్తారట. సమాజంలో బాగా స్థిరపడిన వారు.. ఒకరిని లేదా అంతకంటె ఎక్కువ మందిని గానీ పేదరికం నుంచి బయటకు తెచ్చి ధనికులుగా మార్చాలట.

ఈ ప్రహసనం అంతా గొప్పగా, ఆదర్శంగా కనిపిస్తుండవచ్చు. కానీ.. పేదరికానికి- పేదరికం నుంచి ధనికులుగా మారడం అనే దశకు ఏది కొలబద్ధ! ఈ కొలతబద్ధలను చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారేమో. అయితే ఇక్కడ ప్రధానంగా కలుగుతున్న భయం ఏంటంటే.. పేద వర్గం నుంచి ధనిక వర్గంగా మారిన తర్వాత కూడా ఆ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చంద్రబాబునాయుడు అందిస్తారా?.

కేవలం జగన్ ను ఓడించే లక్ష్యంతో అలవిమాలని పథకాలను ప్రకటించేసిన చంద్రబాబునాయుడు.. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి.. పేదలను ధనికులుగా మార్చేసినట్లు ఒక నాటకం సృష్టించి.. కొత్త ధనికులు అందరికీ ఇక పథకాలు అందవు అని తేలిస్తే.. జనం నట్టేట మునుగుతారు. 

అసలే చంద్రబాబునాయుడు.. ఆయన ఏమాటలు చెప్పినా సరే, వాటి వెనుక ఎంతో కొంత వంచన దాగి ఉంటుందని అంతా భయపడుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో ‘పూర్ టూ రిచ్’ కార్యక్రమం పేరుతో రాష్ట్రంలో పేదలే లేకుండా చేస్తానని చంద్రబాబు అంటున్న మాటలు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.