Advertisement

Advertisement


Home > Movies - Movie News

తెరవెనక అంతా ఓకేనా బండ్ల గణేశా?

తెరవెనక అంతా ఓకేనా బండ్ల గణేశా?

వివాదాల్ని ఇలా రేపడం, అలా వాటిని వదిలేయడం బండ్ల గణేశ్ కు బట్టర్ తో పెట్టిన విద్య. పైకి చెప్పకపోయినా, ఆయనకు ఏదో 'న్యాయం' జరుగుతుంది. సాంత్వన లభిస్తుంది. అంతే, అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తాడు. ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు దుమారం రేపే ఈ నిర్మాత కమ్ బిజినెస్ మేన్, తాజాగా 'గురూజీ'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అనుకుంటే భార్యాభర్తల్ని, గురుశిష్యుల్ని, తండ్రికొడుకుల్ని విడదీయడానికి కూడా గురూజీ వెనకాడడు అనే అర్థం వచ్చేలా ట్వీట్ వేశాడు. "భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి" అనే మరో వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశాడు. దీంతో చిన్నపాటి దుమారం రేగింది.

అయితే అలా వివాదం మొదలుపెట్టిన 2 రోజులకే ఏమీ ఎరగనట్టు సైలెంట్ అయ్యాడు బండ్ల గణేశ్. దీంతో అతడిపై పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెరవెనక ఈ వివాదం సెటిల్ అయి ఉండొచ్చంటూ కొందరు పోస్టులు పెడుతుంటే.. ఈ వివాదాన్ని చల్లార్చింది పవన్ కల్యాణేనా అంటూ మరికొందరు క్వశ్చన్ చేస్తున్నారు.

ఈ వాదనలకు మరింత ఊతమిస్తూ మరో ప్రకటన చేశాడు బండ్ల గణేశ్. పవన్ అంటే తనకు ప్రాణం అని మరోసారి ప్రకటించుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే, తెరవెనక ఏదో 'సర్దుబాటు' జరిగినట్టు కనిపిస్తోందంటున్నారు చాలామంది.

"కింద భూమి ఉందనే వాస్తవంలో బతుకుతా" అని చెప్పుకునే బండ్ల గణేశ్.. ఎప్పటికప్పుడు మాట మారుస్తుంటారు. రాజకీయాలకు దూరమని ప్రకటించిన నోటితోనే తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పుకున్నారు. హరీశ్ ను తిట్టిన నోటితోనే మళ్లీ పొగిడారు. విజయసాయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వెనక్కు తగ్గారు. దేవర అనే టైటిల్ ను తన దగ్గర నుంచి కొట్టేశారంటూనే, ఎన్టీఆర్ కూడా తనకు దేవరే అని ప్రకటించుకున్నాడు.

ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో అంశాలపై రెండు నాల్కల ధోరణి చూపించాడు బండ్ల గణేశ్. ఇప్పుడు గురూజీ విషయంలో కూడా ఆయన దాదాపు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. తను అనుకున్న 'ఫలితం' దక్కడంతో, ఎప్పట్లానే బండ్ల గణేశ్ సైలెంట్ అయ్యాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?